కాకినాడ: బియ్యం ఎగుమతుల్లో ఇండియా కొత్త రికార్డు నెలకొల్పనున్నది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 45 శాతం బియ్యాన్ని మన దేశమే ఎగుమతి చేయనున్నది. బియ్యాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో రెండవ స్థానంలో ఉన్న ఇండియా.. ఈ ఏడాది అత్యధికంగా ఆఫ్రికా, ఆసియా దేశాలకు సరఫరా చేయనున్నది. కాకినాడలో ఉన్న పోర్ట్ ద్వారా ఈ ఏడాది సుమారు 22 మిలియన్ టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఓలమ్ గ్రూపు ఉపాధ్యక్షుడు నితిన్ గుప్తా ఈ విషయాన్ని తెలిపారు. థాయిలాండ్, వియత్నాం, పాకిస్థాన్ దేశాల కన్నా.. అత్యధిక స్థాయిలో మన దేశం ఈసారి బియ్యాన్ని ఎగుమతి చేయనున్నది. ఈ ఏడాది కొత్తగా చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ కూడా మన దేశం నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 2020లో బియ్యం ఎగుమతులు అమాంతంగా 49 శాతం పెరిగినట్లు పోర్ట్ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది నాన్ బాస్మతి రైస్ ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే రెండింతలు పెరిగాయి.
థాయిలాండ్, వియత్నాం బియ్యంతో పోలిస్తే.. ఇండియన్ రైస్ చాలా చౌకగా దొరుకుతుంది. అయితే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మన బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. గత ఏడాది కాకినాడ నుంచి బియ్యం ఎగుమతుల్లో సమస్యలు వచ్చాయి. దీంతో ఈ సారి రైస్ షిప్పింగ్ కోసం కాకినాడ వద్ద డిప్వాటర్ పోర్ట్‌ను వాడారు. డీప్‌వాటర్ పోర్ట్ వల్ల వెసల్ వెయిటింగ్ పీరియడ్ తగ్గినట్లు రైస్ ఎగుమతి సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణా రావు తెలిపారు. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో ఇండియా 12.84 మిలియన్ టన్నుల రైస్‌ను ఎక్స్పోర్ట్ చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 65 శాతం ఎక్కువ. అయినా షిప్పింగ్ ప్రక్రియ చాలా నెమ్మదిగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. 33వేల టన్నుల బియ్యాన్ని షిప్లో ఎక్కించేందుకు నెల రోజుల సమయం పడుతోందని, అదే థాయిలాండ్‌లో 11 రోజుల్లో ఎక్కిస్తారని ఓ అధికారి తెలిపారు. కాకినాడ నుంచి అదనంగా మరో రెండు మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉన్నట్లు అక్కడి వారంటున్నారు.