India-Japan : ఇండియా-జపాన్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. ఈ మేరకు రాబోయే పదేళ్లలో ఇరు దేశాల మధ్య 10 ట్రిలియన్ యెన్ల (దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు) పెట్టుబడులు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని సనాయె తకాచి ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. అక్కడి హైదరాబాద్ భవన్లో మోదీ, సనాయే తకైచి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య అంశాలకు సంబంధించి 120 వరకు ఒప్పందాలు కుదిరాయి.
దీనిలో భాగంగా రాబోయే పదేళ్లలో రెండు దేశాల మధ్య 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులకు అవకాశం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం జపాన్ కంపెనీలు ఇండియాలో తమ పెట్టుబడులను పెంచుకుంటాయి. ఇండియాలో పని చేస్తున్న కంపెనీలు తమ పెట్టుబడుల్ని పెంచుకుంటాయి. కొత్త కంపెనీలు కూడా వస్తాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘ఇండియా-జపాన్ మధ్య భాగస్వామ్యం నెమ్మదిగా బలపడుతోంది. ఏడాది కాలంగా రెండు దేశాల మధ్య వ్యాపారాలకు సంబంధించి 120 ఒప్పందాలు కుదిరాయి. ఇండియాలోకి 10 బిలియన్ డాలర్ల జపాన్ పెట్టుబడులు వస్తాయి. ఈ రోజు కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉంది. రాబోయే పదేళ్లలో జపాన్ నుంచి 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులను ఆకర్షించడమే మా లక్ష్యం. భారత్ నిత్యం తీసుకొస్తున్న సంస్కరణలు పెట్టుబడుల్ని తీసుకొస్తున్నాయి. వ్యాపార అవకాశాల్ని వృద్ధి చేస్తున్నాయి. జపాన్ కంపెనీలు కూడా లబ్ధి పొందుతున్నాయి.
జపాన్ ప్రధాని తకైచి భారత పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య అధ్యాయం మొదలవుతోంది. ఇండియా, జపాన్లు ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థలు. స్వేచ్ఛ, సమృద్ధి, ఇండో-పసిఫిక్ రూల్స్ ఆధారిత విధానాలు మా ప్రాధాన్యం. ఈ రోజు ఎన్నో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాం. సాంకేతిక అంశాల్లో భాగస్వామ్యం రెండుదేశాల మధ్య బలమైన సహకారానికి పునాదివేస్తుందని నేను, తకైచి నమ్ముతున్నాం’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, న్యూక్లియర్ ఎనర్జీ వంటి వాటిలో కూడా సహకారం అందించుకుంటామని మోదీ అన్నారు.