PM Modi : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తో దేశం యావత్తు ఉలిక్కిపడింది. ప్రపంచ దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ (Pakistan) మాత్రం ఇప్పటికీ ఈ దాడిని ఖండించలేదు. దాంతో పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) మరోసారి స్పందించారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలకు తన ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు.
ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పని ప్రధాని మోదీ అన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు (Angola President) జువా మాన్యేల్ గొంకాల్వ్స్ లోరెన్సో (Joao Manuel Goncalves Lourenc) తో ప్రధాని మోదీ శనివారం ఉదయం భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనను మోదీ ప్రస్తావించారు.
ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని చెప్పారు. పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికిందని తెలిపారు. అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఉగ్రవాదులు, వారికి మద్దతిచ్చేవారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని, తగిన రీతిలో జవాబు చెప్పితీరుతామని హెచ్చరించారు.