
Shock for Dragon | డ్రాగన్‌కు భారత్ మరోమారు షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన ఐదు రకాల ఉత్పత్తులపై ఐదేండ్ల పాటు యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పొరుగుదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులు చౌక ధరలకే లభిస్తుండటంతో దేశీయ ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయి. దేశీయ ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
ఈ జాబితాలో అల్యూమినియం, సోడియం హైడ్రోసల్ఫేట్, సిలికాన్ సీలెంట్, హైడ్రోఫ్లోరో కార్బన్, కాంపొనెంట్ ఆర్-32, హైడ్రోఫ్లోరో కార్బన్‌మిశ్రమాలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల మేరకే ఈ యాంటీ డంపింగ్ డ్యూటీలు విధిస్తారు.
చౌక దిగుమతులతో దేశీయ కంపెనీలు దెబ్బతినకుండా ఈ డ్యూటీ వసూలు చేస్తారు. దేశీయ కంపెనీలు నిలదొక్కుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అయితే, భారత్, చైనాలు డబ్ల్యూటీవోలో సభ్యదేశాలే కావడం గమనార్హం.