న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రిడేటర్ డ్రోన్లను(Predator Drones) భారత్ కొనుగోలు చేయనున్నది. సుమారు 31 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ డ్రోన్లను ఖరీదు చేసేందుకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో భారత సైనిక సత్తా మరింత బలోపేతం కానున్నది. అయితే ఆ డ్రోన్లలో భారత నౌకాదళానికి 15 డ్రోన్లు దక్కనున్నట్లు తెలుస్తోంది. వాటిని సీ గార్డియన్ వేరియంట్‌గా వాడనున్నారు. ఇక ఆర్మీ, వైమానికి దళానికి ఎనిమిదేసి డ్రోన్లను ఇవ్వనున్నారు. స్కై గార్డియన్ ప్రిడేటర్ డ్రోన్ల రూపంలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ వాడనున్నది. డ్రోన్ల ఖరీదు విలువ మొత్తం సుమారు 3.5 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికా ఉత్పత్తిదారుడు జనరల్ ఆటోమిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్, విదేశీ మిలిటరీ సేల్స్ శాఖ మధ్య కాంట్రాక్టు కుదిరింది. ఈ ఖరీదుకు గత నెలలోనే క్యాబినెట్ కమిటీ నుంచి క్లియరెన్స్ దక్కింది.