Chenab River | న్యూఢిల్లీ, మే 5: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై చేపట్టిన చర్యలలో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన భారత్ తాజగా చీనాబ్ నది నుంచి పాక్‌కు వెళ్లే జలాలకు అడ్డుకట్ట వేసింది. పాకిస్థాన్‌లోకి ప్రవహించే చీనాబ్ నదీ జలాలను నియంత్రించే బాగ్లిహార్, సలాల్ డ్యాంల గేట్లను భారత ప్రభుత్వం మూసివేసింది. జమ్మూ కశ్మీరులోని రియాసీ జిల్లాలో ఉన్న సలాల్ డ్యామ్ గేట్లన్నీ మూసివేయడంతో దిగువ ప్రాంతాలలో నీటి ప్రవాహ స్థాయి పడిపోవడంతోపాటు చాలా చోట్ల నది ఎండిపోయినట్లు తెలుస్తోంది. బాగ్లిహార్ డ్యామ్ గేట్లను మూసివేయడంతోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. మరో ప్రధాన నది జీలం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు నిర్మించిన కిషన్‌గంగా డ్యాం వద్ద కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది.
పాకిస్థాన్‌పై ఆర్థిక దాడులే లక్ష్యంగా భారత్ పావులు కదుపుతోంది. పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలకు అందుతున్న నిధులను అడ్డుకునేందుకు భారత్ చర్యలు చేపట్టింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) అధ్యక్షుడిని కలుసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ పాక్‌కు నిధులు నిలిపివేయాలని డిమాండు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పాక్‌కు అందుతున్న ఏడీబీ రుణాలను నిలిపివేయాలని కోరింది. ఇటలీలోని మిలాన్‌లో ఏడీబీ వార్షిక సమావేశంలో ఆ బ్యాంకు అధ్యక్షుడు మసాటో కాండాతో సమావేశమైన నిర్మలా సీతారామన్ ఇటలీ ఆర్థిక మంత్రి జియాన్కార్లో గియోర్గెట్టి వద్ద కూడా ఇదే డిమాండ్ తెచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి.