Delimitation | శాశ్వత అధికారమే లక్ష్యంగా రచించిన పునర్విభజన కుట్ర పటాపంచలైంది. మహిళా బిల్లుతో ముడిపెట్టి, దేశాన్ని మభ్యపెట్టేందుకు చేసిన యత్నం బెడిసికొట్టింది. వివిధ రాష్ర్టాల ఎన్నికల వేళ.. మహిళా ఓట్లకు గాలమేసే ఎత్తుగడ ఎదురుతిరిగింది. దురాశతో మొదలు పెట్టిన తంత్రం దుఃఖంతో ముగిసిపోయింది.
భారత రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. సాధారణంగా అమెరికా లాంటి దేశాల్లో ప్రభుత్వాల నిర్ణయాలు ఆ దేశ చట్టసభల్లో పరీక్షకు నిలుస్తాయి. విస్తృత చర్చ తర్వాతే బిల్లులు ఆమోదం పొందుతాయి. కానీ మనదేశంలో కొంతకాలంగా అధికార పార్టీ అనుకున్నదే చట్టబద్ధ నిర్ణయంగా చెలామణి అవుతూ వస్తున్నది. ఆర్థిక బిల్లుల ముసుగులోనూ అనేక నిర్ణయాలను ప్రభుత్వాలు ఆమోదం పొందేలా చేసుకున్నాయి. కానీ అతి అరుదుగా, ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం పెట్టిన బిల్లును లోక్‌సభ తిరస్కరించింది. 2029 నుంచి మహిళలకు చట్టసభల్లో 33శాతం కోటా అమలు చేసేందుకు తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది.
ఇప్పటికే అనేక రాష్ర్టాల్లో వరుస ఓటములను ఎదుర్కొంటున్న బీజేపీకి ఇది శరాఘాతం. మోదీ సూపర్‌మ్యాన్ బుడగ క్రమంగా కుంచించుకుపోతున్న తీరుకు ఇది సంకేతం. ఒక ప్రతిష్ఠాత్మక బిల్లు చర్చకు పెట్టిన ఎన్డీఏ సర్కార్ చేసిన వ్యూహాత్మక తప్పిదంతో మహిళా ప్రాతినిధ్య పెంపు చట్టం మరో దశాబ్దం ముందుకు వెళ్లిపోయింది. ముఖ్యమైన చట్టం రూపకల్పన జరుగుతున్నపుడు అన్నిపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆలోచన, విస్తృత చర్చకు అవకాశమివ్వాలనే ధోరణి, మద్దతు కూడగట్టేందుకు తగిన సంప్రదింపులు జరిపే కార్యాచరణ లేకుండా బీజేపీ ఆడిన డ్రామా బెడిసికొట్టింది.
మహిళా బిల్లుకు పార్లమెంట్ బ్రేక్‌వేయడం బీజేపీ ఊహించని పరిణామం. ఉక్కిరిబిక్కిరైన కేంద్రం.. ఇదే వరుసలో రావాల్సిన మరో రెండు బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. వాటి భవిష్యత్తు ఏమిటనేది ఎవరికీ తెలియని ప్రశ్న. దేశ రాజకీయాలన్నీ డీలిమిటేషన్ చుట్టూ తిరుగుతున్న వేళ.. ఈ చర్య రాజకీయవర్గాలను అయోమయంలో పడేసింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తామని బయల్దేరిన 56 ఇంచుల ఛాతిగల సర్కార్ ఆఖరికి యుద్ధం చేయకుండానే అస్త్రసన్యాసం చేసేసింది. రాజకీయాలంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కాదని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఇప్పుడు జ్ఞానోదయం కలిగి ఉంటుంది. ఏ పార్టీకైనా చాలా అరుదుగా లభించే అద్భుత అవకాశాన్ని చేజార్చుకున్న సర్కార్‌గా ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోనున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరిట నియోజకవర్గాల పునర్విభజన క్రతువును పూర్తి చేయాలనుకొన్న మోదీ-షా ద్వయానికి గట్టి షాక్ తగిలింది.131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. అవసరమైన మెజారిటీ కంటే 54 ఓట్లు తక్కువగా రావడంతో బిల్లు సభ ఆమోదం పొందలేదు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో దీనికి అనుబంధంగా ఉన్న డీలిమిటేషన్ బిల్లు, యూటీ చట్ట సవరణ బిల్లులను వెనక్కి తీసుకొంటున్నట్టు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అనంతరం సభను శనివారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. లోక్‌సభలో బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని తాము ఓడించామన్నారు. ఈ బిల్లు మహిళా రిజర్వేషన్ల బిల్లు కాదని తాము ముందు నుంచే చెప్తున్నామని తెలిపారు. ఈ పద్ధతిలో మహిళా బిల్లును తీసుకురావడాన్ని తాము వ్యతిరేకించామని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేర్కొనగా.. ఢిల్లీని ఓడించామని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.గురువారం ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. 15 నుంచి 18 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం సాయంత్రం 7.20 గంటలకు ఈ బిల్లుపై డివిజన్ ఓటింగ్‌ను నిర్వహించారు. అయితే ఈ ఓటింగ్‌లో బిల్లు.. అవసరమైన మెజారిటీని సాధించలేకపోయింది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా.. బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. అంటే ప్రస్తుత బిల్లు ఆమోదం పొందాలంటే, 352 మంది అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది. అయితే, బిల్లుకు మద్దతుగా కేవలం 298 ఓట్లు మాత్రమే రావడంతో ఈ బిల్లు వీగిపోయినట్టు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో దీనికి అనుబంధంగా ఉన్న డీలిమిటేషన్ బిల్లు, యూటీ చట్ట సవరణ బిల్లులను వెనక్కి తీసుకొంటున్నట్టు కేంద్రమంత్రి రిజిజు తెలిపారు. అనంతరం సభను శనివారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్‌తోపాటు ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంపునకు ప్రతిపక్షాలు వ్యతిరేకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుచేసేందుకు, పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రవేశపెట్టిన మూడు సవరణ బిల్లులపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిస్తూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల హేతుబద్ధీకరణకు దారితీస్తుందని చెప్పారు. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నపుడు డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టని కాంగ్రెస్ ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ చర్చను ఎవరైనా జాగ్రత్తగా వింటే మహిళా రిజర్వేషన్ల కోసం చేసిన రాజ్యాంగ సవరణను ఎవరూ వ్యతిరేకించలేదని అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ మేము ఈ చర్యను స్వాగతిస్తున్నామనే అన్నారు. కానీ ఇండియా గ్రూపులోని సభ్యులందరూ మహిళా రిజర్వేషన్లను స్పష్టంగా వ్యతిరేకించారు అని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాజ్యాంగం కాలానుగుణంగా నియోజకవర్గాల పునర్విభజనకు వీలు కల్పిస్తుందని, అందులో పెరుగుతున్న జనాభా నిష్పత్తిలో ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచే నిబంధనలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే డీలిమిటేషన్‌ని వ్యతిరేకిస్తున్న వారు ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపుదలనూ వ్యతిరేకిస్తున్నట్లేనని ఆయన చెప్పారు.
డీలిమిటేషన్ ప్రతిపాదన వెనుక ప్రభుత్వానికి రహస్య ఎజెండా ఉందన్న విపక్షం ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. డీలిమిటేషన్‌ని ఇప్పుడు నిర్వహించడానికి కారణాలేమిటని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని ఆయన అన్నారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ప్రకారం 2026 తర్వాత నిర్వహించే జనాభా లెక్కల అనంతరం జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన చెప్పారు. తాము ఆ పని చేయలేదని ఆయన అన్నారు. 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉన్నపుడు వారే డీలిమిటేషన్‌ని నిలిపివేశారు. నిలిపివేసిన సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా మాత్రమే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయగలం. అందుకే మేము ఈ బిల్లులను తీసుకువచ్చాము అని అమిత్ షా చెప్పారు. 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న 127 సీట్లు ఉన్నాయని, ఇది ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలున అనే సూత్రం స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని కూడా హోం మంత్రి చెప్పారు. కొన్ని చోట్ల 45 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉండగా కొన్ని చోట్ల ఆరు లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉన్నారు. ఫలితంగా నియోజకవర్గాల వారీగా ప్రతి ఓటు విలువ సమానంగా లేదు అని ఆయన అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు విపక్షాలు మద్దతు ఇస్తే అన్ని రాష్ర్టాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య 50 శాతం పెంపును ప్రస్తావిస్తూ అధికారిక సవరణ తీసుకువస్తామని అమిత్ షా వాగ్దానం చేశారు. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయకపోతే అది వీగిపోతుంది. కానీ దీనికి అడ్డంకి ఎవరో దేశంలోని మహిళలు గమనిస్తున్నారు అని ఆయన చెప్పారు.
అంతకుముందు లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. బాలాకోట్, పెద్దనోట్ల రద్దు, ఆపరేషన్ సిందూర్‌ల ఇంద్రజాలికుడిగా (మెజీషియన్) ప్రధాని మోదీని వ్యంగ్యంగా వర్ణించి వివాదాన్ని రేకెత్తించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్ర శిబిరాలపై 2019లో జరిగిన వైమానిక దాడులు, 2016లో రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు, గత సంవత్సరం ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలపై జరిపిన సరిహద్దు దాడులతోసహా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను రాహుల్ నిశితంగా విమర్శించారు. మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుపై ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ మాట్లాడుతూ సభలో బిల్లులు ఆమోదం పొందవని బీజేపీకి పూర్తిగా తెలుసని పేర్కొంటూ ఇది భయాందోళనతో తీసుకున్న చర్యగా అభివర్ణించారు. ఈ చర్య వెనుక రెండు లక్ష్యాలు ఉన్నాయని ఆయన అన్నారు. మొదటిది, భారతదేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చడం, ప్రధానమంత్రిని మహిళా పక్షపాతిగా చూపించడం అని రాహుల్ చెప్పారు. ‘నిజం ఏమిటంటే మెజీషియన్(ఇంద్రజాలికుడు) పట్టుబడ్డారు. బాలాకోట్, పెద్ద నోట్ల రద్దు, సిందూర్ మెజీషియన్ చివరకు బట్టబయలయ్యారు’ అని ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండా రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు..
మహిళా కోటా చట్ట సవరణపై తమ పార్టీ చేస్తున్న ఆందోళనను ఉద్దేశించి ప్రధాని మోదీ ‘కాలా టికా’ అని వ్యాఖ్యానించడం పట్ల డీఎంకే నేత కనిమొళి మండిపడ్డారు. నలుపు రంగు కాళీ దేవతకు ప్రతిరూపమని, తమ పార్టీ ఈ విషయంలో చివరి వరకు ఆందోళన కొనసాగిస్తుందని చెప్పారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా డీఎంకే సభ్యులు నల్ల దుస్తులతో సభకు హాజరవ్వడాన్ని చూసి ప్రధాని.. ఇది దిష్టి తగలకుండా కాపాడే కాలా టికాలా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు.
శుక్రవారం లోక్‌సభలో గంభీరమైన చర్చ జరుగుతుండగా రాహుల్ సరదాగా చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించి వాతావరణాన్ని తేలికపరిచాయి. మన జాతీయ ఆలోచనలో, మన జాతీయ దృక్పథంలో మహిళలు ఒక కేంద్ర శక్తి. ఒక చోదక శక్తి. ఈ సభలోని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లోని మహిళల నుంచి అంటే తల్లులు, సోదరీమణుల నుంచి చాలా ప్రభావితులయ్యారు. ఎంతో నేర్చుకున్నారు’ అంటూ కొన్ని సెకండ్లు ఆగి భార్యలు అని చేర్చారు. అయితే తనకు, ప్రధాని మోదీకి ‘భార్య సమస్య లేదు’ అని రాహుల్ చిరునవ్వుతో చేసిన వ్యాఖ్యకు సభ నవ్వులతో మార్మోగింది.
మహిళా రిజర్వేషన్‌పై చర్చ సందర్భంగా టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శుక్రవారం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. మహిళా సాధికారతపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ సీట్లకు మాత్రమే పరిమితం కాకూడదని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర క్యాబినెట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. మరో అడుగు ముందుకేసి ప్రధాన మంత్రి పదవిని, స్పీకర్ పదవిని రొటేషన్ పద్ధతిలో మహిళలకు రిజర్వ్ చేయాలని ఆయన సూచించారు. అదే జరిగితే 2029 ఎన్నికల్లో ప్రస్తుత నాయకత్వం మళ్లీ అధికారంలోకి రాదంటూ బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. డీలిమిటేషన్ కోసం ఆగకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన అన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 2002లో డీలిమిటేషన్ చేశారు. ప్రస్తుతం మనం 2026లో ఉన్నాం. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తామంటున్నారు. 15 ఏండ్లు గడిచిపోయాయి. దీనిపై ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు. మహిళా రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు. కానీ, ఈ అంశాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని బెనర్జీ చెప్పారు.
‘నారీ శక్తి’ పేరిట ప్రధాని మోదీ మహిళలకు ముండ్ల తీగలతో చుట్టిన బహుమతిని ఇస్తున్నారని కాంగ్రెస్ నేత శశి థరూర్ విమర్శించారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన ‘రాజకీయ నోట్ల రద్దు’గా మారబోతున్నదని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై లోక్‌సభలో శుక్రవారం జరిగిన చర్చలో థరూర్ మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. నవ భారతదేశం వైపు పడే అడుగులు విచ్ఛిన్న భారత్‌ను ఇచ్చేదిగా ఉండకూడదని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం మహిళల ఆకాంక్షలను మరింత దూరం చేయడమేనని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై సంబంధిత అన్ని వర్గాలతో, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో, రాజకీయ పార్టీలతో, పౌర సమాజంతో విస్తృత సంప్రదింపులు జరపాలని సూచించారు. ఆదరాబాదరాగా చేయకూడదని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌ను పక్కన పెట్టి మహిళా బిల్లును ఆమోదించాలన్నారు.
నంబర్స్ కా గేమ్ సమయ్ తయ్ కరేగా!
(నంబర్ గేమ్‌ను సమయం నిర్ణయిస్తుంది)
– గురువారం లోక్‌సభలో ప్రధాని అన్న మాటలివి.
24 గంటలు గడిచింది. మోదీ మాటలే నిజం అయ్యాయి. నంబర్ గేమ్‌ను టైమే డిసైడ్ చేసింది. సంఖ్యాబలం సమయం చూసి దెబ్బకొట్టింది
దక్షిణాది ఐక్యంగా నిలిచి తమ గళాన్ని వినిపించడంతో ప్రజాస్వామ్యం విజయం సాధించింది, ఇది ట్రైలర్ మాత్రమే, వచ్చే ఎన్నికల్లోనూ విజయం మాదే. మహిళా రిజర్వేషన్ల బిల్లును వేరే చేసి లోక్‌సభలో ఆమోదించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం అలా చేయలేదు. ఢిల్లీ అహంకారాన్ని, ఆ అహంకారానికి మద్దతిచ్చే బానిసలను 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తాం.
– స్టాలిన్, డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం
సవరణ బిల్లు వీగిపోయింది. మహిళల పేరుతో రాజ్యాంగ విచ్ఛిత్తికి వారు రాజ్యాంగ విరుద్ధ ఎత్తుగడ వేశారు. దేశం దాన్ని గమనించి, అడ్డుకున్నది. ఎన్డీయే తెచ్చిన బిల్లు లక్ష్యం.. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కాదు, భారత ఎన్నికల నిర్మాణాన్ని మార్చడం. మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే.. 2023నాటి చట్టాన్ని తెస్తే, అన్ని పక్షాలూ పూర్తిగా సహకరించి ఉండేవి.
– రాహుల్‌గాంధీ, లోక్‌సభలో విపక్ష నేత
కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుటిల రాజకీయాల వల్లే దేశంలోని మహిళా లోకానికి దకాల్సిన రిజర్వేషన్లు వెంటనే దకకుండా పోయాయి. బీఆర్ఎస్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు పలికినా, డీలిమిటేషన్ పేరుతో కావాలనే బీజేపీ చికుముళ్లు పెట్టి బిల్లు విఫలమ య్యేలా చేసింది. దక్షిణాది రాష్ర్టాల ఆందోళనలు, డీలిమిటేషన్ పర్యవసానాలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు పోవడంతో చారిత్రక అవకాశం జారిపోయింది.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్