India-China Talks | లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)లో కొనసాగుతున్న ఉద్రిక్తల మధ్య భారత్, చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. 19వ రౌండ్ చర్చలు సరిహద్దులోని చుషుల్-మోల్డోలో జరిగింది. పశ్చిమ సెక్టార్లో ఎల్ఏసీతో పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై ఇరుపక్షాలు లోతైన చర్యలు జరిపారు. సమావేశంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చైనా అంగీకరించింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కొనసాగించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.
తూర్పు లడఖ్‌లోని నియంత్రణ రేఖ వెంట బలగాల ఉపసంహరణకు సంబంధించిన అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయి. భేటీలో డెప్సాంగ్, డెమ్‌చోక్‌తో సహా ఇతర ఘర్షణ జరిగిన ప్రాంతాల నుంచి దళాలను త్వరగా ఉపసంహరించుకోవాలని భారత్ చైనాపై ఒత్తిడి తెచ్చింది. దీంతో పాటు ఉద్రిక్తతను తగ్గించేందుకు చర్యలు జరిపారు. దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్ సదస్సుకు ముందు ఇరుదేశాల మధ్య సైనిక చర్చలు జరిగాయి. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పాల్గొననున్నారు. చర్చలకు లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి, చైనా వైపు దక్షిణ జిన్జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ నాయకత్వం వహించారు. ఇంతకు ముందు ఏప్రిల్ 23న ఇరుదేశాల మధ్య 18వ రౌండ్ చర్చలు జరిగాయి. అప్పుడు సైతం డెప్పాంగ్, డెమ్చోక్లో సైన్యాన్ని ఉపసంహరించాలని భారత్ పట్టుబట్టింది.
చైనా పాంగోంగ్ సరస్సు సమీపంలో డివిజన్ స్థాయి ప్రధాన కార్యాలయాన్ని నిర్మించింది. ఈ కార్యాలయంలో గోగ్రా హాట్ స్ప్రింగ్స్‌కు దక్షిణంగా ఉంది. గాల్వన్ వ్యాలీలో చైనా తన భూభాగంలో బ్యారక్‌లను నిర్మించింది. భారతదేశం, చైనా మధ్య 3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. దీన్ని తూర్పు సెక్టార్, వెస్ట్రన్ సెక్టార్, సెంట్రల్ సెక్టార్ విభజించారు. జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కీం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చైనాతో సరిహద్దులను పంచుకుంటున్నాయి. పశ్చిమ సెక్టార్లో జమ్మూ కాశ్మీర్, జిన్జియాంగ్, ఆక్సాయ్ చిన్ సరిహద్దు ప్రాంతాల విషయంలో ఇరుదేశాల మధ్య పేచీ నెలకొన్నది.