న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్(Eastern Ladakh)లోని వాస్తవాదీన రేఖ వద్ద పెట్రోలింగ్ నిర్వహించే అంశంలో భారతీయ, చైనా అధికారుల మధ్య జరిగిన చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. పెట్రోలింగ్ అంశంలో ఓ డీల్ కుదిరినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి తెలిపారు. రెండు దేశాల సరిహద్దుల మధ్య ఉన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు కొన్ని వారాల నుంచి చర్చలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. దీప్‌సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో నిర్వహించే పెట్రోలింగ్ అంశంలో అగ్రిమెంట్ కుదిరినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్ సిటీకి మోదీ వెళ్తున్న నేపథ్యంలో.. చైనా, భారత్ సరిహద్దు అంశంలో డీల్ కుదరడం గమనార్హం. వాస్తవానికి ఆ డీల్‌కు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. కానీ బ్రిక్స్ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.