న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: తూర్పు లఢఖ్‌లోని వాస్తవాధీనరేఖ వద్ద భద్రత, స్థిరత్వాన్ని నెలకొల్పాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఇరుదేశాల సైనిక బలగాల కమాండర్ స్థాయి అధికారుల మధ్య ఆదివారం 18వ రౌండ్ చర్చలు జరిగాయి. ఈ చర్చలపై భారత విదేశీ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
మిలటరీ, దౌత్య మార్గాల్లో చర్చలు కొనసాగించాలని, మిగతా అన్ని సమస్యలపై పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావాలని ఈ చర్చల్లో ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. సరిహద్దుల్లో శాంతిని పునరుద్ధరించడానికి వివాదాల పరిష్కారానికి లోతైన చర్చలు జరిగాయని, ఇది ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి దోహదపడుతుందని తెలిపింది. మార్చిలో జరిగిన ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి కొనసాగింపుగా, ప్రభుత్వ మార్గదర్శకంలో ఈ చర్చలు జరిపినట్టు పేర్కొన్నది.