China | న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా కాలంగా తవ్వకాలు చేస్తున్నట్టు తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. చైనా సైన్యం అక్కడ ఆయుధాలు, ఇంధనాన్ని నిల్వ చేసుకొనేందుకు అండర్ గ్రౌండ్ బంకర్లు, సాయుధ వాహనాలకు రక్షణ కల్పించేలా పార్కింగ్ నిర్మాణాలు చేస్తున్నట్టు అమెరికాకు చెందిన బ్లాక్‌స్కై సంస్థ శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైంది.
ఈ ఏడాది మే 30న తీసిన ఈ ఫోటోల ప్రకారం.. ఒక పెద్ద అండర్ గ్రౌండ్ బంకర్లోకి వాలుతో కూడిన ఎనిమిది ప్రవేశ మార్గాలు కనిపించాయి. అదేవిధంగా దానికి సమీపంలో ఐదు ప్రవేశాలతో కూడిన మరో చిన్న బంకర్ కూడా ఉన్నది. ఈ తవ్వకాలన్నీ చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) స్థావరమైన సిర్జాప్ బేస్ వద్ద జరుగుతున్నాయి.
కాగా, చైనా ఈ ఆర్మీ బేస్‌ను భారత్ తన భూభాగంగా చెబుతున్న ఏరియాలో నిర్మించింది. ఈ ప్రాంతం సరిహద్దు వాస్తవధీన రేఖ(ఎల్ఏసీ)కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తాజా శాటిలైట్ చిత్రాలపై భారత సైన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.