హైదరాబాద్, నవంబర్ 21 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): 2019-2020లో పార్లమెంట్ ఆమోదించిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ నాలుగు లేబర్ కోడ్లను నోటిఫై చేసినట్టు వెల్లడించింది. ఇకపై ఈ నాలుగు కోడ్లు దేశ చట్టాలుగా మారుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాండవీయ ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ స్థాయిలో కనీస వేతనాన్ని నిర్ణయించడానికి కేంద్రం ఓ కమిటీని నియమిస్తుందని, రానున్న 45 రోజుల్లో ఈ నాలుగు కోడ్లకు సంబంధించిన పూర్తి నియమ, నిబంధనలను ప్రచురిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కార్మికులు రోజుకు 8-12 గంటల చొప్పున అంటే వారంలో గరిష్ఠంగా 48 గంటలు విధులు నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఓవర్‌టైమ్ డ్యూటీ చేసిన వారికి రెట్టింపు వేతనం చెల్లించాలని నిబంధనల్లో పొందుపరిచినట్టు గుర్తు చేశారు.
1. వేతనాల కోడ్, 2019: సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి కనీస వేతనం పొందేందుకు అవసరమైన సూత్రాలు ఇందులో ఉన్నాయి. సకాలంలో వేతన చెల్లింపులపై కూడా ఇందులో నిబంధనలు పొందుపరిచారు.
2. పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020: కార్మికులకు, కంపెనీల యాజమాన్యాలకు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి.
3. సామాజిక భద్రత కోడ్, 2020: సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులతో పాటు గిగ్ వర్కర్లకు లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్స్‌కు ఉద్దేశించిన అంశాలను ఇందులో పొందుపరిచారు.
4. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్, 2020: పని ప్రాంతాల్లో కార్మికులకు వ్యక్తిగత, వృత్తిపరమైన భద్రత, వారి ఆరోగ్యం, పరిహారానికి సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి.
కేంద్రం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల సంయుక్త వేదిక శుక్రవారం పిలుపునిచ్చింది. శుక్రవారం నుంచి వీటిని అమల్లోకి తేవడం ఏకపక్షం, కార్మిక వ్యతిరేకం, యాజమాన్యాలకు అనుకూలమని ఆరోపించింది. సంక్షేమ రాజ్య చట్రాన్ని అణచివేసే చర్య అని మండిపడింది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, తదితర సంఘాలు ఈ ప్రకటనను విడుదల చేశాయి.