న్యూఢిల్లీ: 2025లో భారత్, పాకిస్థాన్ దేశాలు కొత్త తరహా అణ్వాయుధ డెలివరీ వ్యవస్థలను అభివృద్ధి చేసినట్లు ఓ నివేదిక(SIPRI Report) ద్వారా తెలిసింది. బాలిస్టిక్ క్షిపణులకు వార్‌హెడ్స్‌ను అమర్చే సామర్థ్యాన్ని కూడా ఆ దేశాలు పెంచుకున్నట్లు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టట్యూట్(ఎస్ఐపీఆర్ఐ) తన నివేదికలో పేర్కొన్నది. భారత్, చైనా దేశాలు తమ వద్ద ఉన్న అణ్వస్త్రాల సంఖ్యను పెంచుకున్నట్లు ఆ నివేదికలో చెప్పారు. దీంతో పాటు వారహెడ్స్ ఉన్న అణ్వాయుధాలను వ్యవూహాత్మక ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. జనవరి 2026 నాటికి భారత్ వద్ద సుమారు 190 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఇక చైనా వద్ద నిల్వల్లో 620 వార్‌హెడ్స్ ఉన్నాయి. గత ఏడాది ఆ దేశం వద్ద 600 మాత్రమే ఉండే అని స్టాక్‌హోమ్ రీసర్చ్ సంస్థ తెలిపింది.
భారత్ తన యుద్ధ విమానాలు, నేల నుంచి ప్రయోగించే మిస్సైళ్లు, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలాంతర్గామిలకు న్యూక్లియర్ వెపన్స్‌ను అమర్చినట్లు కూడా ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా అదనపు మిస్సైళ్ల కోసం మరికొన్ని వార్‌హెడ్స్‌ను కూడా తయారు చేస్తున్నట్లు సిప్రి తన రిపోర్టులో చెప్పింది. ఆ వార్‌హెడ్స్ ఉన్న క్షిపణులను కంటేనర్లకు తరలిస్తున్నట్లు కూడా రిపోర్టులో చెప్పారు. స్టాక్‌హోమ్ సంస్థ అంచనాల ప్రకారం.. 2026 జనవరి నాటికే స్వల్ప సంఖ్యలో ఉన్న వార్‌హెడ్స్‌ను ఇండియా తన జలాంతర్గాములకు తరలించినట్లు తెలుస్తోంది. చైనాపై ఫోకస్‌తో ఇండియాన తన లాంగ్ రేంజ్ వెపన్ సిస్టమ్‌లను తయారు చేసుకుంటున్నట్లు రిపోర్టులో తెలిపారు. దీంతో పాటు పాకిస్థాన్‌తో ఉన్న శత్రుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇండియా తన ప్లానింగ్ చేస్తున్నట్లు సిప్రి నివేదికలో చెప్పారు.
ఇక పాకిస్థాన్ అణ్వాయుధాల రిపోర్టును సిప్రి ప్రజెంట్ చేసింది. అయితే జనవరి 2026 నాటికి పాకిస్థాన్ తన న్యూక్లియర్ నిల్వలను స్థిరంగా ఉంచినట్లు పేర్కొన్నది. ఆ దేశం వద్ద 170 వార్‌హెడ్స్ ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించారు. ల్యాండ్, ఎయిర్ సామర్థ్యంలో బాగానే ఉన్నా.. సముద్ర సామర్థ్యాన్ని పాక్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. అయితే రాబోయే దశాబ్ధంలో తన అణ్వస్త్ర సామర్ధ్యాన్ని పాక్ పెంచుకోనున్నదని రిపోర్టులో పేర్కొన్నారు.
జనవరి 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,187 అణ్వాయుధాలు ఉన్నట్లు స్టాక్‌హోమ్ సంస్థ తెలిపింది. మిలిటరీ వద్ద 9745 ఆయుధాలు ఉన్నాయని ఆ రిపోర్టులో చెప్పారు. ఇక 4012 మాత్రం క్షిపణులు, ఎయిర్‌క్రాఫ్ట్ లో నిక్షిప్తం చేశారు. రష్యా, అమెరికా దేశాలు సుమారు 2200 ఆయుధాలను హై అలర్ట్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. భారత్, చైనా దేశాలు కూడా హై ఆపరేషనల్ అలర్ట్‌లో వార్‌హెడ్స్‌ను పెట్టినట్లు తెలుస్తోంది. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్ దేశాల వద్ద ఎంఐఆర్వీ టెక్నాలజీ ఆయుధాలు ఉన్నాయి. ఇక ఇండియా, పాక్, ఉత్తర కొరియా ఆ టెక్నాలజీ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఎంఐఆర్వీ టెక్నాలజీ అత్యంత శక్తివంతమైందని భావిస్తున్నారు. ఇండియా కూడా ఇటీవల అగ్ని-5 మధ్యంతర క్షిపణి ద్వారా ఎంఐఆర్వీ టెక్నాలజీని పరీక్షించింది. మరోవైపు పాక్ మీడియం రేంజ్ క్షిపణులను డెవలప్ చేస్తున్నది.