INDIA alliance : దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోపాటు కూటమిలోని వివిధ పార్టీల అధినేతలంతా హాజరయ్యారు.
వారిలో సమాజ్‌వాది పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌పవార్, ఆ పార్టీ ముఖ్య నాయకుడు జితేంద్ర అవహాద్, ఆప్ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ముఖ్య నాయకులు భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) నేత టీఆర్ బాలు, ఆర్జేడీ (RJD) నేతలు తేజస్వియాదవ్, సంజయ్ యాదవ్, జేఎంఎం (JMM) నేతలు చంపాయ్ సోరెన్, కల్పనా సోరెన్ ఉన్నారు.
వారితోపాటు జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి డీ రాజా, సీపీఎం (CPM) జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి, ఉద్ధవ్ బాల్ థాకరే (UBT) శివసేన నాయకుడు అనిల్ దేశాయ్, సీపీఐ ఎంఎల్ (CPI (ML)) పార్టీ నేత దీపాంకర్ భట్టాచార్య తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో దేని గురించి చర్చిస్తున్నారనేది మరికాసేపట్లో వెల్లడికానుంది.