బెంగుళూరు: కర్నాటకలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. 1924 నాటి స్మారక సమావేశాలను గుర్తుచేస్తూ.. ఇవాళ స్మారక మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరం అంతా పోస్టర్లను ప్రదర్శించారు. అయితే ఆ పోస్టర్లపై ఉన్న భారత దేశ మ్యాప్‌ను(Incorrect Indian Map) తప్పుగా చిత్రీకరించారు. ఆ పోస్టర్లలో ఉన్న మ్యాప్‌లో.. పాక్ ఆక్రమిత గిల్గిత్ ప్రాంతం కానీ, చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతం లేవని బీజేపీ ఆరోపించింది. ఆ రెండు ప్రాంతాలు జమ్మూకశ్మీర్లోనివే.
ఈ వివాదంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. పోస్టర్లలో ఏదైనా పొరపాటు ఉంటే, వాటిని తొలగిస్తామన్నారు. బహుశా కొందరు తప్పు చేసి ఉంటారు, వాటిని తొలగిస్తున్నామన్నారు. కావాలని బీజేపీ తమను అటాక్ చేస్తోందని, ఈర్ష్యకు మందు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. రాహుల్ గాంధీ మొహబత్ కి దుకాన్.. ఎప్పుడూ చైనా కోసం తెరిచి ఉంటుందని, ఈ దేశాన్ని ముక్కలు చేస్తారని, గతంలో చేశారని, మళ్లీ చేస్తారని బీజేపీ ఆరోపించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ భారతదేశ మ్యాప్‌ను సరిగా చిత్రీకరించలేదని బీజేపీ విమర్శించింది.
సమావేశాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసు కేసు రిజిస్టర్ చేయాలని విజయపురా బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ డిమాండ్ చేశారు. ఇండియా మ్యాప్‌ను సరైన రీతిలో చిత్రీకరించని పక్షంలో అది ఉల్లంఘన అవుతుందన్నారు. తప్పుడు మ్యాప్‌ను ప్రచురించడం ఐపీసీలోని సెక్షన్ 74 ప్రకారం నేరం అన్నారు.నేషనల్ హానర్ యాక్టు ప్రకారం కూడా ఉల్లంఘనే అని పేర్కొన్నారు.