ఉత్తరకాశి (ఉత్తరాఖండ్), జూలై 20: డబుల్ ఇంజిన్ సర్కార్‌లో వైద్య సేవల దుస్థితికి నిదర్శనం ఈ వార్త. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో వైద్య సౌకర్యాల పరిస్థితికి నిలువుటద్దం ఈ స్టోరీ. 52 ఏండ్ల మహిళ అస్వస్థతకు గురైతే డాక్టర్‌కు చూపించేందుకు 12 కిలోమీటర్లు భూజాలపై మోసుకెళ్లాళ్సిన ధైన్యం. వివరాల్లోకి వెళితే.. ఉత్తరకాశి జిల్లాలోని దింగడి గ్రామానికి చెందిన శంకుతలాదేవి వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నది.
ఇంటి వైద్యం పనిచేయలేదు. సమీపంలో ఎక్కడా వైద్య సదుపాయం లేదు. దాంతో 12 కిలోమీటర్ల దూరంలోని సర్నోల్లో ఉండే డాక్టర్‌కు చూపించాలని ఆమె కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఆమె కూర్చొనే కుర్చీకి రెండు బొంగులు అడ్డంగా (డండి) కట్టి భుజాలపై మోసుకెళ్లారు. ఉత్తరాఖండ్ ఏర్పడి 22 ఏండ్లు అయినా, స్వాత్రంత్యం వచ్చి 75 వసంతాలు గడిచినా, బడియార్లోని ఎనిమిది గ్రామాల్లో వైద్య సదుపాయలు లేవని స్థానిక సోషల్ వర్కర్ కైలాశ్ రావత్ ఆవేదన వ్యక్తంచేశారు. వైద్యసేవలే కాదు.. సరైన రోడ్లు కూడా లేవని, చదువుకునేందుకు స్కూల్స్ కూడా లేవని పేర్కొన్నారు.