కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, దాని పరిసర జిల్లాల్లో శుక్రవారం, శనివారం ఎడతెరిపిలేని వర్షాలు కురిశాయి. దీంతో విమానాశ్రయం సహా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్ప పీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు తెరిపి ఇవ్వడం లేదు. ఈ నెల 7 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్ట్ 1 వరకు వరదల వల్ల రాష్ట్రంలో 77 మంది చనిపోయారని, రూ.655 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. కొండ చరియలు విరిగిపడటంతో కులు-మనాలీ హైవే తీవ్రంగా దెబ్బతింది. వర్షాల వల్ల రాష్ట్రంలో 190 రోడ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. 82 మార్గాల్లో బస్సు సర్వీసులను నిలిపేసినట్లు ఆర్టీసీ ప్రకటించింది. గల్లంతైన 50 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. సమేజ్ అనే గ్రామంలో కేవలం ఒకటి మినహా మిగిలిన ఇండ్లన్నీ కొట్టుకుపోయాయి. బుధవారం జరిగిన ఈ ఘటన గురించి గ్రామస్థురాలు అనిత దేవి మాట్లాడుతూ.. “మేము బయటకు చూసేసరికి గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. మేమంతా భగవతి కాళీమాత గుడిలో రాత్రంతా తల దాచుకున్నాం” అని గద్గద స్వరంతో చెప్పారు.