DK Shivakumar : ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలకుగాను తమ కూటమి 40 స్థానాలు గెలుస్తుందని కాంగ్రెస్ సీనియర్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఉత్తప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మంచి స్థితిలో ఉన్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మేం 40 సీట్లు గెలుస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాను తమ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఇప్పుడే కలిశానని, మా 10 గ్యారంటీల గురించి ఆయన ముందు ప్రస్తావించానని డీకే చెప్పారు. ఈ సందర్భంగా ఖర్గే మరో హామీని ప్రకటించారని తెలిపారు. పేదలకు ప్రతి నెల అదనంగా 10 కిలోల ఉచిత బియ్యం ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారని వెల్లడించారు. మేం ఇచ్చిన హామీలన్ని ప్రజాసంక్షేమానికి ఉపకరించేవిగా ఉన్నందున లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మాకే అనుకూలంగా ఉండబోతున్నాయని అన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీఎస్పీకి, సమాజ్‌వాదీ పార్టీకి, బీజేపీకి ఎక్కువ ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు సమాజ్ వాదీ ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తమ కూటమికి 40 సీట్లు వస్తాయని డీకే ధీమా వ్యక్తం చేశారు. 2019లో బీఎస్పీ, ఎస్పీ, ఆరెల్డీ కలిసి కూటమిగా బరిలో దిగాయి. ఆ కూటమికి 15 సీట్లే వచ్చాయి. ఎన్డీఏ కూటమి 64 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే వచ్చింది. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ ఇండియా కూటమిగా బరిలో ఉన్నాయి. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తున్నది.