న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన 11 మంది ఖైదీలకు శిక్షాకాలం పూర్తి కాకుండానే క్షమాభిక్ష పేరుతో గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీం కోర్టు విచారణ నిర్వహించింది. ఇలాంటి చర్య ప్రమాదకరమంటూ జడ్జీలు వ్యాఖ్యానించారు. ‘ఈ కేసులో ఖైదీలకు విధించిన మరణ శిక్షను జీవితఖైదుకు తగ్గించారు. అలాంటప్పుడు వారిని 14 ఏండ్లకే ఎలా విడుదల చేస్తారు? ప్రభుత్వ పాలసీ ప్రకారం వారికి కల్పించిన ఈ సౌకర్యం మిగిలిన వారికి ఎందుకు కల్పించరు?’ అంటూ జస్టిస్‌లు బీవీ నాగరత్న, ఉజ్జల్ భూయాన్ ప్రశ్నించారు. ‘కరడుగట్టిన క్రిమినల్స్‌కే సంస్కరణ పొందే అవకాశం కల్పించారు.
ఈ విషయంలో కొందరికి మాత్రమే అనుకూలంగా ఆచితూచి వ్యవహరించారు. మరి మిగిలిన వారి సంగతి ఏమిటి? వారికి ఎందుకు ఈ అవకాశం కల్పించ లేదు? అసలీ పాలసీ ఎంతకాలం నుంచి అమలు చేస్తున్నారు? అది అమలవుతుంటే జైళ్లు ఇలా ఎందుకు కిక్కిరిసి ఉన్నాయి’ అని న్యాయస్థానం ప్రశ్నించింది. బిల్కిస్ ఖైదీల విషయంలో ఏ ప్రాతిపదికన జైలు అడ్వైజరీ కమిటీ ఏర్పడింది? అని ప్రశ్నించిన న్యాయస్థానం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు గోద్రా కోర్టులో విచారణ జరగనప్పుడు ఆ న్యాయస్థానం అభిప్రాయాన్ని ఎందుకు కోరారు? ఖైదీలను విడుదల చేయరాదంటూ సీబీఐ నివేదిక ఇచ్చింది కదా? అయినా ఎందుకు విడుదల చేశారు అని ప్రశ్నించింది.తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది.
సమాధానం చెప్పడం కష్టం
గుజరాత్ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ సాధారణంగా ఇలాంటి వాటికి సమాధానం చెప్పడం కష్టమని పేర్కొన్నారు. 1992లో తెచ్చిన పాలసీని అనుసరించి చట్టప్రకారమే ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు.