న్యూఢిల్లీ, జూన్ 25: లోక్‌సభ స్పీకర్ పదవికి ఈ సారి ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలన్న షరతుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో స్పీకర్ స్థానానికి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది. ఎన్డీయే కూటమి తరఫున మాజీ స్పీకర్ ఓం బిర్లా పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి తరఫున సీనియర్ ఎంపీ కొడికున్నిల్ సురేశ్ బరిలో నిలిచారు. దీంతో గత 50 ఏండ్లలో తొలిసారిగా, స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగనున్నది. వాస్తవానికి స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం సంప్రదాయంగా వస్తున్నది. అయితే గత పర్యాయంలో డిప్యూటీ స్పీకర్‌ను నియమించలేదు. ఈసారి ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించిన ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టింది. అందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలిపింది.
డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించాలనే సంప్రదాయాన్ని ప్రభుత్వం పాటించడం లేదని కేసీ వేణుగోపాల్ విమర్శించారు. గత లోక్‌సభను డిప్యూటీ స్పీకర్ లేకుండానే బీజేపీ నడిపిందని, అంతకుముందు తమ మిత్రపక్ష కూటమికి ఇచ్చిందని జైరాం రమేశ్ మండిపడ్డారు. మన్మోహన్ సింగ్, వాజ్‌పేయీ, పీవీ నరసింహరావు హయాంలోనూ డిప్యూటీ స్పీకర్ పోస్టును విపక్షాలకు కేటాయించారని ఎక్స్ పోస్టులో గుర్తుచేశారు. కాగా, బాల్ ప్రభుత్వం కోర్టులోనే ఉన్నదని, విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇచ్చేందుకు అంగీకరిస్తే, స్పీకర్ పోటీని ఉపసంహరించుకుంటామని కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా పేర్కొన్నారు. కాగా, విపక్ష పార్టీలు ఒత్తిడి రాజకీయాలు చేస్తున్నాయని, ముందస్తు కండిషన్లు పెడుతున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు.
వయనాడ్ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ప్రస్తుతం లోక్‌సభలో 542 మంది ఎంపీలు ఉన్నారు. అధికార ఎన్డీయే కూటమికి 293 మంది సభ్యులు ఉండగా.. విపక్ష ఇండియా కూటమి ఎంపీలు 233 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లాకు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తున్నది. ఆయన మరోసారి స్పీకర్‌గా ఎన్నికైతే, ఒక టర్మ్ కంటే ఎక్కువ సార్లు స్పీకర్ అయిన ఐదో వ్యక్తి అవుతారు.
స్పీకర్ పోస్టుకు ఇండియా కూటమి సురేశ్‌ను అభ్యర్థిగా నిలబెట్టే విషయంలో తమ పార్టీని సంప్రదించలేదని టీఎంసీ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. పోటీపై టీఎంసీ వైఖరేంటి? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ ‘మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. చర్చలు చేయలేదు. దురదృష్టవశాత్తూ ఇది ఏకపక్ష నిర్ణయం’ అని పేర్కొన్నారు. సురేశ్‌కు మద్దతు విషయంపై తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకొంటారని అన్నారు. అయితే ఆ తర్వాత అభిషేక్ బెనర్జీతో పార్లమెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ మాట్లాడటం కనిపించింది.
18వ లోక్‌సభకు అనివార్యంగా జరుగుతున్న కొత్త స్పీకర్ ఎన్నిక స్వతంత్ర భారతదేశ చరిత్రలో మూడోది అని, దాదాపు గత 50 ఏండ్లలో తొలిసారి అని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. 1952 తర్వాత స్పీకర్ పోస్టుకు ఎన్నిక జరుగనుండటం ఇది మూడోసారి. లోక్‌సభ సెక్రటేరియట్ వివరాల ప్రకారం మొదటగా 1952 తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన స్పీకర్ ఎన్నికలో శంకర్ శాంతారాంపై జీవీ మౌలాంకర్ గెలిచారు. మౌలాంకర్‌కు 394 ఓట్లు రాగా, శాంతారంకు 55 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 1976లో రెండోసారి బాలిరాం భగత్, జగన్నాథ్ రావ్ మధ్య అలాంటి పోటీ జరిగింది. 344-58 ఓట్ల తేడాతో జగన్నాథ్ రావ్‌పై భగత్ విజయం సాధించారు.
స్పీకర్ పోస్టుకు ఎన్డీయే కూటమి నుంచి నామినేషన్ వేసిన ఓంబిర్లా ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని కోటా స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2014, 2019ల్లోనూ ఆయన ఇదే స్థానం నుంచి వరుసగా గెలుపొందారు. 2019-24 టర్మ్‌లో అనూహ్యంగా లోక్‌సభ స్పీకర్ అయిన ఓంబిర్లా.. ఈసారి కూడా ఎన్నికలో గెలిస్తే, గత రెండు దశాబ్దాలకు పైగా కాలంలో రెండోసారి స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తి అవుతారు. ఎంపీ కాకముందు ఓంబిర్లా రాష్ట్ర అసెంబ్లీకి ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1991-2003 మధ్య బీజేవైఎంలో వివిధ హోదాల్లో పనిచేశారు.
ఇండియా కూటమి నుంచి స్పీకర్ పదవికి పోటీచేస్తున్న కే సురేశ్ కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. దళిత వర్గానికి చెందిన సురేశ్ 8 సార్లు ఎంపీగా గెలిచారు. 2009లో ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించారన్న కేసులో ఎంపీగా ఆయన ఎన్నిక చెల్లదని కేరళ హైకోర్టు ప్రకటించగా.. తర్వాత సుప్రీంకోర్టు ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. కే సురేశ్ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని మవెలిక్కర(ఎస్సీ) స్థానం నుంచి విజయం సాధించారు. 1989లో తొలిసారి అదూర్ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన సురేశ్.. 2012-14 మధ్య కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు.