ముంబై: ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన మహారాష్ట్రలో బస్సులు, ఆటోలు, క్యాబ్ ఛార్జీలను పెంచారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) నడుపుతున్న బస్సుల ఛార్జీలు 14.95 శాతం మేర పెరిగాయి. (Bus Fares Hiked) హైక్ కమిటీ ప్రతిపాదించిన బస్సు ఛార్జీల పెంపును ఆ రాష్ట్ర ఆర్టీసీ శుక్రవారం ఆమోదించింది. దీంతో శనివారం నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పెరిగిన ఛార్జీలపై ఆర్టీసీ బస్సు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, ఆటోలు, క్యాబ్స్ బేస్ ఛార్జీలు కూడా రూ.3కు పెంచారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎంఎంఆర్టీఏ) దీనిని ఆమోదించింది. దీంతో ఆటో బేస్ రేట్లు రూ.23 నుంచి రూ.26కు, టాక్సీ బేస్ ఛార్జీలు రూ.28 నుంచి రూ.31కు పెరిగాయి. అలాగే బ్లూ అండ్ సిల్వర్ ఏసీ కూల్ క్యాబ్ ఛార్జీలను కూడా రూ.8కు పెంచారు. దీంతో తొలి 1.5 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం రూ.40 ఉండగా కొత్త ఛార్జీ మేరకు రూ.48కు పెరిగింది.