తిరువనంతపురం: రోడ్డుపై వేగంగా వెళ్లిన లారీ అదుపుతప్పింది. విద్యార్థుల మీదకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు మరణించారు. (Students Killed) కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కల్లడికోడ్ సమీపంలోని పానయంపాడు వద్ద గురువారం సాయంత్రం స్కూల్ తర్వాత బస్సు కోసం కొందరు బాలికలు రోడ్డు పక్కన వేచి ఉన్నారు. సిమెంట్ లోడ్‌తో వేగంగా వెళ్లిన లారీ అదుపుతప్పింది. రోడ్డు పక్కన వేచి ఉన్న విద్యార్థులపైకి అది దూసుకెళ్లింది. రోడ్డు దిగువన బోల్తాపడింది. దీంతో ఆ లారీ కింద నలిగి నలుగురు పిల్లలు మరణించారు.
కాగా, ఈ ప్రమాదంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డును శాస్త్రీయంగా నిర్మించలేదని, పలు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటతిల్ ఈ సంఘటనపై స్పందించారు. ప్రమాదాలకు నిలయంగా మారిన రోడ్డు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.