Chhattisgarh | నాగ్‌పూర్: కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల జీవితాలు దయనీయంగా మారాయి. బస్తర్‌తో పాటు మహారాష్ట్ర సరిహద్దులో ఉండే నాలుగైదు జిల్లాల్లో నివసించే గిరిజనులు కనీస వసతులకు నోచుకోక దీనావస్థలో బతుకీడుస్తున్నారు. రోడ్లు, వైద్య సౌకర్యాలు లేక దినదినగండంలా జీవిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటితేనే వైద్యం అందే పరిస్థితి నెలకొంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో జ్వరంతో బాధపడుతున్న ఓ యువతిని బల్లపై మోసుకుంటూ 25 కిలోమీటర్లు కాలినడకన దవాఖానకు తీసుళ్లిన ఘటనే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నది.
బస్తర్ జిల్లా బకవాండ్ ప్రాంతంలోని మెటవాడకు చెందిన ఓ యువతికి జ్వరం వచ్చింది. తను నడవలేని స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులు ఆమెను చెక్క బల్లపై ఉంచి భుజాలపై మోసుకుంటూ దవాఖానకు పయనమయ్యారు. రాష్ట్ర సరిహద్దులు దాటి.. 25 కిలోమీటర్ల దూరం పయనించి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా లహెరి పీహెచ్‌సీకి చేరుకున్నారు. అక్కడ చికిత్స అందడంతో ఆ యువతి ప్రాణాలు దక్కాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నాలుగైదు సరిహద్దు జిల్లాల ప్రజలు ఈ పీహెచ్‌సీలోనే వైద్య సేవలు అందుకుంటారని లహెరి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ శంభాజీ బోక్రే తెలిపారు. మరోవైపు బస్తర్ జిల్లా సీనియర్ వైద్యాధికారి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేదని, అక్కడికి అంబులెన్స్‌లు వెళ్లవని తెలిపారు. అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చేందుకు ఆ ప్రాంతాల్లో సిగ్నళ్లు కూడా అందుబాటులో ఉండవని వివరించారు.