ముంబై: మోసం కేసులో మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ నేత మాణిక్రావ్ కోకాటేకు (Manikrao Kokate) నాసిక్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసిందని, ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. 1995లో ప్రభుత్వ కోటా కింద ఫాట్లు పొందడానికి నకిలీ పత్రాలు సమర్పించినట్లు మాణిక్రావ్ కోకాటే, అతడి సోదరుడు సునీల్ కోకాటేపై మాజీ మంత్రి దివంగత టీఎస్ డిఘోలే ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదైంది.
కాగా, నాసిక్ జిల్లా, సెషన్స్ ఈ కేసుపై విచారణ జరిపింది. మంత్రి మాణిక్రావ్ కోకాటే, అతడి సోదరుడు సునీల్ కోకాటేను దోషులుగా నిర్ధారించింది. ఒక్కొక్కరికి రూ. 50,000 జరిమానా కూడా విధించింది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది.
మరోవైపు కోర్టు తీర్పుపై మంత్రి మాణిక్రావ్ స్పందించారు. రాజకీయ శత్రుత్వం కారణంగా డిఘోలే ఈ కేసు దాఖలు చేశారని తెలిపారు. ‘తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నా. మేం చట్టప్రకారం ప్రతిదీ చేస్తాం. మేం హైకోర్టుకు వెళ్తాం. సెషన్స్ కోర్టు నాకు బెయిల్ మంజూరు చేసింది’ అని మీడియాతో అన్నారు. అయితే హైకోర్టు నుంచి ఉపశమనం లభించకపోతే మాణిక్రావ్ కోకాటే శాసనసభా సభ్యత్వంపై అనర్హత వేటు పడే అవకాశమున్నది.