లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి (Mayawati) ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయ వారుసుడిగా భావిస్తున్న మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మరోసారి అన్ని పార్టీ పదవుల నుంచి తొలగించారు. ఆకాష్ తండ్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్‌ను కొత్త జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు. ఆదివారం లక్నోలో జరిగిన బీఎస్పీ సమావేశంలో ఈ మేరకు పార్టీలో భారీ మార్పులు చేశారు.
కాగా, బీఎస్పీ సంస్థాగత బలాన్ని బలహీనపరిచే వర్గాలను సృష్టించడం ద్వారా పార్టీలో విభజనకు అశోక్ సిద్ధార్థ్ కారణమయ్యారని మాయావతి ఆరోపించారు. పార్టీకి లేదా ఉద్యమానికి హాని కలిగించడానికి తన పేరును దుర్వినియోగం చేస్తే వారిని వెంటనే తొలగిస్తానని ఆమె స్పష్టం చేశారు.
మరోవైపు ఈ సూత్రానికి అనుగుణంగా అశోక్ సిద్ధార్థ్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు మాయావతి తెలిపారు. ఆయన ప్రభావం ఉన్న అల్లుడు ఆకాష్ ఆనంద్‌ను కూడా పార్టీ బాధ్యతలన్నింటి నుంచి తొలగించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని బహుజనుల పురోగతికి మాత్రమే కాకుండా దేశ పురోగతికి ఈ మార్పు అవసరమని అన్నారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జయంతి వేడుకల ప్రణాళికలను కూడా మాయావతి వెల్లడించారు.