న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: మదుపరుల ప్రయోజనాల కోసమే రూ.20,000 కోట్ల ఎఫ్‌పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్)ను వెనక్కి తీసుకున్నామని గురువారం ఓ వీడియో సందేశంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ప్రస్తుత మార్కెట్ ఒడిదుడుకుల్లో ఎఫ్‌పీవో నైతికత కాదనిపించిందని చెప్పారు. ఈ క్రమంలోనే మదుపరుల బాగే తమకు తొలి ప్రాధాన్యతని, ఆ తర్వాతే ఏదైనా అని వ్యాఖ్యానించారు. నిన్నమొన్నటిదాకా హిండెన్‌బర్గ్ రిపోర్టును అదానీ గ్రూప్‌నకు సంబంధించినది కాదని, భారత జాతిపై జరిగిన దాడి అంటూ గౌతమ్ అభివర్ణించడం గమనార్హం. మునుపెన్నడూ ఏ సంస్థ చేయలేనివిధంగా బుధవారం రాత్రి అదానీ గ్రూప్ ఎఫ్‌పీవోను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పింది. ఈ నేపథ్యంలోనే రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్‌హెచ్‌పీ)ను వెనక్కి తీసుకుంటున్న ట్టు గురువారం తెలిపింది.