దక్షిణాసియా మొత్తం కశ్మీర్ అంశం విషయంలో ఓ బందీగా మారిపోయిందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లోని ”వ్యూహాత్మక సంబంధాల అధ్యయన కేంద్రం” నిర్వహించిన సదస్సులో ఇమ్రాన్ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. తాము శాంతికోసం చేస్తున్న ప్రయత్నాలను భారత్ తప్పుగా అర్థం చేసుకుంటోందని, అది మా బలహీనతగా భావిస్తోందని దుయ్యబట్టారు. వాతావరణ మార్పు లాంటి సమస్యలు దక్షిణాసియాను వెంటాడుతున్నాయని, అవి సమసిపోవాలంటే భారత్, పాక్ దేశాలు కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందన్నారు.
”దక్షిణాసియాలో ఒకే ఒక్క పెద్ద సమస్య ఉంది. కశ్మీర్ విషయంలోనే దక్షిణాసియా బందీగా మారిపోయింది. భారత్‌తో చర్చలు జరిపే విషయంలో మా వంతు ప్రయత్నాలన్నీ చేశాం. చేయాల్సిందంతా చేశాం. ఆ తర్వాత నాకు అర్థమైంది. అది మా బలహీనతగా భావిస్తున్నారని.” తామేదో బలహీనులమైపోయామని, అందుకే చర్చల ప్రస్తావన తెస్తున్నామని భారత్ భావిస్తోంది అని వివరించారు. తాము ఓ సాధారణ భారత ప్రభుత్వంతో చర్చలు జరపడం లేదని, ఓ సైద్ధాంతికతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. ఇరు దేశాల మధ్య ఉన్నది ఒకే ఒక సమస్య అని అది కశ్మీర్ సమస్య అని నొక్కి వక్కాణించారు. ఆ సమస్య తుపాకులతో పరిష్కారం కాదని, కేవలం చర్చలతోనే పరిష్కారమవుతుందని ఇమ్రాన్ తేల్చి చెప్పారు.