Delhi High Court | లైంగిక నేరాలు, యాసిడ్ దాడులు సహా ఇతర నేరాల బాధితులకు చికిత్స చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరించలేవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయా బాధితులకు ఉచిత వైద్యం అందిచకపోవడం నేరమని.. అన్ని ఆసుపత్రులు బాధితులకు ఉచిత వైద్యం అందించాలని.. లేకుంటే క్రిమినల్ చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి అత్యాచారం చేసిన కేసులో.. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. చట్టం ఉన్నప్పటికీ బాధితులకు ఉచిత వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని కోర్టు పేర్కొంది. బాధితులు టెస్టింగ్ లేబొరేటరీ, నర్సింగ్ హోమ్, హాస్పిటల్, హెల్త్ క్లినిక్లను సంప్రదించిన సమయంలో ఉచిత వైద్యం అందించాలని బెంచ్ పేర్కొంది. బాధితులకు చికిత్స నిరాకరించడం నేరమని, ఈ విషయాన్ని వైద్యులు, అధికారులు, అధికారులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పాటు లైంగిక నేరానికి గురైన బాధితురాలిని వెంటనే పరీక్షించి చికిత్స అందించాలని ధర్మాసనం ఆదేశించింది.
అవసరమైతే.. బాధితురాలికి హెచ్ఐవీ, మరేదైనా లైంగికంగా సంక్రమించే వ్యాధులకు సైతం ఉచితంగా చికిత్స చేయిస్తామని కోర్టు తెలిపింది. చికిత్సలో ప్రథమ చికిత్స మాత్రమే కాకుండా, రోగనిర్ధారణ, ఇన్-పేషెంట్ అడ్మిషన్, అవుట్-పేషెంట్ సహాయం అందించాలని.. అవసరమైన పరీక్షలు, శస్త్ర చికిత్స, ఫిజికల్ సపోర్ట్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సైతం ఇవ్వాలని బెంచ్ చెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 375సీ, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 397, పోక్సో రూల్స్, 2020లోని రూల్6(4) ప్రకారం ఉచిత వైద్యం రాష్ట్ర, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ రెఫర్లపై ఆధారపడి ఉండదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఆసుప్రతి ప్రవేశ ద్వారం, రిసెప్షన్తో పాటు పలుచోట్ల బాధితులకు ఉచిత వైద్యం గురించిన సమాచారంతో కూడిన బోర్డులను ఇంగ్లిష్, స్థానిక భాషల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆయా దవాఖానలు గుర్తింపు కార్డును సైతం డిమాండ్ చేయొద్దని.. అతవసర పరిస్థితుల్లో అవసరమైన వైద్య సహాయం అందించేందుకు నిరాకరించడం, ఎఫ్ఐఆర్ కోరడం శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది.