IMD : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పిడుగుల (Lightnings) తో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఇండియన్ మెటియరోలాజికల్ డిపార్టుమెంట్ – IMD) హెచ్చరించింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhyapradesh), విదర్భ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తూర్పు రాజస్థాన్ మొదలు పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, బీహార్ మీదుగా గంగాపరివాహక పశ్చిమబెంగాల్ వరకు పిడుగుల వాన పడే ప్రమాదం ఉందని ఐఎండీ పేర్కొంది. పైన పేర్కొన్న అన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా అసోం, కర్ణాటక, ఉత్తరాఖండ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.