Winter Season | ఈ శీతాకాలంలో తీవ్రమైన చలి ఉండే అవకాశం లేదని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. డిసెంబర్-ఫిబ్రవరి మధ్య దేశంలోని ఉత్తర-పశ్చిమ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్స్ వీచే రోజుల సంఖ్య తక్కువగా ఉంటాయని అంచనా. వాతావరణశాఖ అంచనా మేరకు.. చాలా ప్రాంతాల్లో శీతాకాలంలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నది. లా నినా పరిస్థితులు ఏర్పడకపోవడంతో ఈ ఏడాది శీతాకాలం సాధారణం కంటే వేడిగా ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఫసిఫిక్ మహాసముద్రం, ఎగువ వాతావరణం మధ్య పరస్పర చర్యల వల్ల లా నినా పరిస్థితి ఏర్పడుతుంది. లా నినా సాధారణంగా చల్లి శీతాకాలంతో సంబంధం ఉంటుంది. కానీ, ఈ ఏడాది ఈ దృగ్విషయం జరుగలేదు. లా నినా సమయంలో ట్రేడ్ విండ్స్ బలంగా మారుతాయి. దాంతో పెద్ద మొత్తంలో నీరు పశ్చిమ ఫసిఫిక్ ప్రాంతం వైపు కదులుతుంది. తూర్పు పసిఫిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలను చల్లబరుస్తుంది.
అయితే, లా నినా పరిస్థితులు జనవరి, ఫిబ్రవరి 2025 నాటికి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభం నాటికి లా నినా పరిస్థితులు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్ మాసంలో దేశం మొత్తం సాధారణం కంటే ఎక్కువగా వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. ఇది లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA) కంటే 121శాతం ఎక్కువ. ద్వీపకల్పంలోని చాలా ప్రాంతాలు, పశ్చిమ-మధ్య భారతదేశం, తూర్పు-మధ్య భారతం, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారతదేశంలోని దక్షిణ ద్వీపకల్పంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. అంటే దీర్ఘకాల ఎల్పీఏలో 131శాతం కంటే ఎక్కువ. దక్షిణ ద్వీపకల్పంలో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, కేరళ, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక ఉన్నాయి.