ముంబై, జూలై 31: విద్యా సంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందుకు ఐఐటీ-బాంబే చర్యలు చేపట్టింది. తోటి విద్యార్థుల ప్రాంతం, సామాజికవర్గం తదితర అంశాలను విద్యార్థులు అడగవద్దని ఆదేశించింది. ఈ మేరకు జూలై 29న ఐఐటీ-బాంబే మార్గదర్శకాలు జారీ చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్థి సోలంకి కుల వివక్షకు బలవడంతో తాజా మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్లను క్యాంపస్‌లో అంటించారు.
విద్యార్థుల ప్రాంతం, సామాజికవర్గాలను బహిర్గతం చేసేందుకు వీలున్న జేఈఈ ర్యాంకు, గేట్ స్కోర్లను సైతం అడగవద్దని మార్గదర్శకాల్లో పేర్కొంది. స్పోర్ట్స్, సంగీతం, సినిమాలు, అభిరుచులు తదితర అంశాల ద్వారా తోటి విద్యార్థులతో అనుబంధం పెంచుకోవాలని సూచించింది. మార్గదర్శకాలను ఉల్లంఘించి కుల వివక్షకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐఐటీ-బాంబే హెచ్చరించింది.