Solar Power | ముంబై, మే 26: విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిన క్రమంలో వినియోగదారులకు నెలవారీ విద్యుత్తు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపుతూ, ఒక్క రూపాయితో ఒక విద్యుత్తు యూనిట్‌ను పొందే విధంగా సరికొత్త సోలార్ సెల్ టెక్నాలజీని ఐఐటీ-బాంబే సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ఎక్కువ మొత్తంలో సౌర కాంతిని గ్రహించుకోగల ‘టాండెమ్ సోలార్ సెల్’ను వారు ఆవిష్కరించారు.
తక్కువ కాంతిలోనూ పనిచేయగల ఈ సోలార్ సెల్ నుంచి విద్యుత్తు ఔట్పుట్ 30శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం వాడుతున్న స్టాండర్డ్ సోలార్ ప్యానెల్స్ 20శాతం సౌరశక్తిని మాత్రమే విద్యుత్తు శక్తిగా మార్చగలవు. అంతేగాక వీటిలో ఒక యూనిట్ విద్యుత్తుకు రూ.2.50 నుంచి రూ.4 వరకు ఖర్చు అవుతుంది. 2027నాటికల్లా టాండెమ్ సోలార్ సెల్ అమ్మకాలు మొదలవుతాయని తెలిసింది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి సరుకులతో మనదేశంలో ఆయా కంపెనీలు సోలార్ సెల్స్‌ను తయారుచేస్తున్నాయి. ప్రధానంగా చైనా నుంచి ఎక్కువగా దిగుమతి అవుతాయి. దీనికి పరిష్కారంగా, దేశీయంగా లభించే ముడి పదార్థాలతోనే ‘టాండెమ్ సోలార్ సెల్’ను తయారుచేయవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.