న్యూఢిల్లీ: పంటల్లో జింక్, కాపర్ లోటును సర్దుబాటు చేసి, ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడే మరో రెండు నానో టెక్ ఎరువులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇఫ్కో బుధవారం తెలిపింది. ఇఫ్కో అభివృద్ధి చేస్తున్న నానో టెక్నాలజీ ఆధారిత నూతన ఎరువులు వ్యవసాయ రంగంలో గుర్తింపు పొందుతున్నాయని ఆ సంస్థ ఎండీ యూఎస్ అవస్థి ట్వీట్ చేశారు.
తాజాగా నానో జింక్ (లిక్విడ్), నానో కాపర్ (లిక్విడ్)ను భారత ప్రభుత్వం మూడేళ్ల కాలానికి నోటిఫై చేసిందని తెలిపారు. ఈ రెండిటినీ ఇఫ్కో కొత్తగా అభివృద్దిపరచినట్లు తెలిపారు. వీటికి ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఆమోదం లభించినట్లు చెప్పారు. అయితే ఈ రెండూ మార్కెట్లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయో వెల్లడించలేదు.