Vinesh Phogat : దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని శంభు సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనకు రెజ్లర్ వినేశ్ ఫోగట్ మద్దతు ప్రకటించారు. పంటలకు కనీస మద్ధతు ధర అంశానికి చట్టబద్ధత కల్పించాలని, తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రైతులు చేస్తున్న ఆందోళన ఇవాళ్టితో 200వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో ఇవాళ ఢిల్లీ పరిసరాల్లోని ఖనౌరీ, శంభు, రతన్పుర బార్డర్లను ముట్టడించాలని రైతులు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో వినేశ్ ఫోగట్ వారికి మద్దతు ప్రకటించారు. శంభు బార్డర్‌కు వెళ్లి రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు వినేశ్ ఫోగట్‌ను సత్కరించారు. ఆమె మెడలో పూలమాల వేసి సన్మానించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తా మీరు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా..? అన్న ప్రశ్నకు వినేశ్ ఫోగట్ సమాధానమిచ్చారు. ఇప్పుడు తాను రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. తాను తన కుటుంబాన్ని (రైతులు) కలిసేందుకు వచ్చానని అన్నారు.
ఇక్కడ రాజకీయాలు మాట్లాడితే వారి (రైతుల) పోరాటాన్ని, సంఘర్షణను వృథా చేసినట్లే అవుతుందని ఫోగట్ వ్యాఖ్యానించారు. ఇక్కడ మీడియా ఫోకస్ చేయాల్సింది తనమీద కాదని, రైతుల మీద ఫోకస్ చేయాలని, ఇది తన అభ్యర్థన అని ఆమె అన్నారు. తాను అథ్లెట్‌నని, ఈ దేశం తనదని, తాను కేవలం రాష్ట్రానికే పరిమితమై చేసేదేమీ ఉండదని చెప్పారు. ప్రస్తుతం నా దేశం సమస్యల్లో ఉన్నదని, రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని వినేశ్ డిమాండ్ చేశారు.