ముంబై, జూలై 28 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు ఉచితంగా ఇస్తే వాటి విలువ తెలియదని.. విద్య, శిక్షణ వంటి వాటికి ఫీజులు తీసుకోవడం అవసరమని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ పేర్కొన్నారు. అన్నీ ఉచితంగా కావాలని ప్రజలు కోరుకుంటారని, కానీ ఉచితంగా ఏమీ ఇవ్వకూడదని, ప్రభుత్వ పథకాలు, సేవలలో ఉచితాల సంసృతిని ప్రోత్సహించడం వల్ల వాటి విలువ తగ్గుతుందన్నారు.
స్వయం సమృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయం ఒక వ్యసనం లాంటిదని, ఆ వ్యసనంలో కూరుకుపోయినప్పుడు మనిషి ఆలోచనా శక్తిని కోల్పోతాడని అన్నారు. అధికారం, సంపద, అందం- ఇవన్నీ శాశ్వతం కావు, క్షణికమైనవని అన్నారు. మంచి రోజుల్లో పొగిడేవారు ఎకువ మంది ఉంటారని, కానీ కష్టకాలంలో పలకరించేవారు కూడా ఉండరని పేర్కొన్నారు.