బెంగళూరు: పరీక్షల్లో పాసయ్యేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతుంటారు. కొందరు శ్రద్ధగా చదివి ఉత్తీర్ణులవుతారు. మరికొందరు ఏమీ చదవకుండానే పరీక్ష హాల్‌కు వెళ్లి.. సినిమా స్టోరీలు, ప్రేమ కథలు, తోచిందేదో రాసి ఆన్సర్ షీట్లను (10th Class Answer Sheet) నింపేస్తారు. బరువు చూసైనా పాస్ మార్కులు వేస్తారేమోనని!. ఇక మరికొందరైతే తమది ఖాళీ బుర్ర.. ఎలాగైనా ఈ గండం నుంచి బయట పడేయాలని, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పరీక్ష పేపర్లు దిద్దేవారిని వేడుకుంటారు. ఇంకొందరైతే ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టి.. తమను పాస్ చేయాలని బతిమిలాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ విద్యార్థి మాత్రం.. తన ప్రేమ భవితవ్యం మీ చేతిలోనే ఉంది.. పరీక్షలో పాస్ చేసి నా లవ్‌ను గెలిపించండి అంటూ పరీక్ష పేపర్లో రాసి బతిలాడుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోడిలో జరిగింది.
కర్ణాటకలో ఇటీవలే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (SSLC) అదేనండి పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఉపాధ్యాయులు పేపర్లు దిద్దుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆన్సర్ షీట్ దిద్దుతుండగా.. రూ.500 నోటు కనిపించింది. అందులో దయచేసి నన్ను పాస్ చేయండి. నా ప్రేమ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. నేను పరీక్షలో పాస్ అయితేనే.. ప్రేమలో కూడా పాస్ అవుతాను. మీరు నన్ను పాస్ చేస్తే డబ్బులు ఇస్తాను. నన్ను పాస్ చేయకపోతే.. మా అమ్మానాన్న నన్ను కాలేజీకి పంపించరు అని విద్యార్థి అని రాసుకొచ్చాడు. అది చూసిన టీచర్ ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ పిల్లాడికి ఎంత కష్టం వచ్చింది’..‘ పాస్ చేసేయండి సార్.. పాస్ చేసేయండి’.. ‘ ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ విద్యార్థితో పాటు చాలా మంది కూడా ఆన్సర్ షీటులో డబ్బులు పెట్టి.. పాస్ చేయమంటూ బతిమలాడటం గమనార్హం.