Asaduddin Owaisi | వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వెనెజువెలాలో సైనిక చర్యలు చేపట్టి అక్కడి అధ్యక్షుడినే బంధించినప్పుడు.. మీరు పాకిస్థాన్‌కు వెళ్లి 26/11 ఉగ్రదాడికి పాల్పడిన మాస్టర్‌మైండ్స్‌ను పట్టుకురావచ్చు కదా అని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు. ట్రంప్ చేసినప్పుడు మీరెందుకు చేయలేరని ప్రశ్నించారు. మోదీజీ.. ముంబై దాడులకు కుట్రలు పన్నిన క్రూరులు.. అది మసూద్ అజర్ అయినా సరే.. లష్కరే తోయిబా ఉగ్రవాదులైనా సరే పాకిస్థాన్ నుంచి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక నియంత్రణతో కూడిన విధానాన్ని అనుసరిస్తుందని బీజేపీ ఎంపీ గులాం అలీ ఖటానా తెలిపారు. ప్రధాని మోదీ పాలనలో ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుంటాం తప్ప.. దేశాలను కాదని స్పష్టం చేశారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. మనం పొరుగు దేశాలు చిన్నవైనా, పెద్దవైనా వాటితో స్నేహపూర్వకంగానే ఉండటం మన బాధ్యత అని పేర్కొన్నారు. అందుకే ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రభావితం కావడం లేదని చెప్పారు.
బిహార్ మంత్రి దిలీప్ జైస్వాల్ కూడా ఒవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒవైసీ ఎప్పుడూ హెడ్లైన్లలో రావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని మండిపడ్డారు. ఇప్పుడు ఒవైసీ ట్రంప్‌నకు కూడా సలహాలు ఇస్తున్నారని.. ఆయన సలహాలను ట్రంప్ కూడా పరిగణనలోకి తీసుకుంటాడేమో అని సెటైర్లు వేశారు.
#WATCH | Mumbai | AIMIM chief Asaduddin Owaisi said, “Today we heard that US President Donald Trump’s forces captured Venezuelan President Nicolas Maduro and took him from his country to America. If US President Donald Trump can abduct Venezuelan President Nicolas Maduro from his… pic.twitter.com/OTLyZJ4goK
— ANI (@ANI) January 3, 2026