టోక్యో : పాకిస్థాన్ ఉగ్ర చర్యల గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు భారత ఎంపీలకు చెందిన ఏడు బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే జపాన్‌కు వెళ్లిన బృందంలో తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) ఉన్నారు. టోక్యోలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం రేబిస్ సోకి కుక్క అయితే, పాకిస్థాన్ ఆ జంతువును ఆడిస్తోందని ఆరోపించారు. ఆ పిచ్చి కుక్కను ఆటలు కట్టించేందుకు ప్రపంచం మొత్తం ఒక్కటి కావాలన్నారు. ఉగ్రవాదంపై పోరును ఆపబోమని, సీమాంతర ఉగ్రవాదాన్ని సహించబోమన్నారు. నిజాలు చెప్పేందుకు ఇక్కడకు వచ్చామని, ఇండియా వెనుకడుగు వేయబోదన్నారు.
జేడీయూ ఎంపీ సంజయ్ జా నేతృత్వంలోని ఎంపీల బృందం జపాన్‌కు వెళ్లింది. ఏడు బృందాలు మొత్తం 33 దేశ రాజధానులను విజిట్ చేయనున్నాయి. భయానికి తలొగ్గేది లేదని, వాళ్లకు అర్థం అయ్యే భాషలో చెప్పడం నేర్చుకున్నట్లు అభిషేక్ తన ప్రసంగంలో తెలిపారు. రేబిస్ సోకిన కుక్క తరహాలో పాకిస్థాన్ వ్యవహరిస్తోందని, ఒకవేళ ఆ మృగాన్ని అదుపు చేయకుంటే, అది మరిన్ని పిచ్చి కుక్కలను తయారు చేస్తుందని అభిషేక్ పేర్కొన్నారు. టోక్యోలో ఉన్న ఎంబసీలో భారతీయ సంతతి వ్యక్తులతో ఎంపీల బృందం మాట్లాడింది.
భారత్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. చాలా కచ్చితంగా తమ చర్యలు ఉంటాయని, ఎటువంటి కవ్వింపు ఉండబోదని తెలిపారు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. అయితే మే 10వ తేదీన డీజీఎంవోల చర్చలతో సైనిక చర్యలు నిలిచాయి.