CJI | దేశ రాజధాని ఢిల్లీలో వరదల కారణంగా ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖరాశారు. తాము నిత్యం నరకంలో బతుకుతున్నామంటూ అవినాష్ దూబే అని విద్యార్థి సీజేఐకి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ల చుట్టూ ఉన్న విద్యార్థుల జీవన స్థితిగతులను నరకంగా ఉన్నాయని పేర్కొంటూ.. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం, కోచింగ్ సెంటర్ల నిబంధనల ఉల్లంఘనలను ప్రస్తావిస్తూ వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాజిందర్‌నగర్, ముఖర్జీనగర్లోని ప్రాంతాల్లో ఐఏఎస్ స్టడీ సెంటర్లో ఉన్న లోపాలను లేఖలో ప్రస్తావించారు. ఆయా కోచింగ్ సెంటర్లలో పేలవమైన మౌలిక సదుపాయాలను సీజేఐ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వరదలతో స్థానికులు పోరాడుతున్నారన్నారు. వర్షం కారణంగా సంభవించిన వరదతో బేస్మెంట్ వరద నీటితో నిండి.. ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మోకాళ్ల లోతు మురుగునీటిలో నడవాల్సిన దుస్థితి నెలకొందని.. తమలాంటి విద్యార్థులు నరకయాతన అనుభవిస్తూనే పరీక్షలకు సిద్ధమవుతున్నామంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. బల్దియా అధికారులు మురుగునీటి కాలువ నిర్వహణ చేపట్టడం లేదని.. ఫలితంగా వరదల వర్షం నీటిలో మురుగునీరంతా కలుస్తుందని.. పలుసార్లు ఇండ్లల్లోకి ప్రవేశిస్తుందని సీజేఐ దృష్టికి తీసుకువచ్చారు. అధికారుల ఉదాసీనత కారణంగా విద్యార్థులకు భద్రత లేకుండాపోతుందని విద్యార్థి ఆరోపించారు.
తమలాంటి విద్యార్థులు ఏ రకంగా చూసినా లక్ష్యం దిశగా పయనిస్తున్నామని.. ఇటీవల ఘటన విద్యార్థుల జీవితాలకు భద్రత లేదని రుజువు చేసిందని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని.. విద్యార్థులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అవసరం ఉంటే నిర్భయంగా చదివి.. దేశాభివృద్ధిలో భాగస్వాములమవుతామని అవినాష్ దూబే లేఖలో పేర్కొన్నారు. వరదలకు సంబంధించిన ఘటనలో ఢిల్లీ పోలీసులు ఆదివారం కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్‌ను అరెస్టు చేశారు. రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌పై హత్యతో పాటు పలు అభియోగాల కింద కేసు నమోదైంది. ఇదే కేసులో సోమవారం మరో ఐదుగురిని అరెస్టు చేయగా.. ఇక బల్దియా అధికారులు పలు కోచింగ్ సెంటర్లను సోమవారం సీజ్ చేశారు.