న్యూఢిల్లీ: స్వదేశం నుంచి బలవంతంగా భారత్‌కు శరణార్థిగా వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రెండేండ్ల తర్వాత ‘ఈ సంవత్సరం’ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణ శిక్ష విధించినప్పటికీ ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఒక తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కోర్టు తీర్పును రాజకీయ ప్రేరేపితమైనదిగా కొట్టిపారేశారు. ‘అవామీ లీగ్‌కు నాయకత్వం లేకుండా చేయాలనే రాజకీయ ప్రతీకార ప్రయత్నంలో న్యాయ వ్యవస్థను ఒక పనిముట్టుగా వాడుకొంటున్నారు. ఇలాంటి ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. అప్పుడు వాళ్లు విఫలమయ్యారు, మళ్లీ వాళ్లు విఫలమవుతారు’ అని ఆమె ఎన్టీటీవీతో అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో పలుమార్లు ప్రమాదాలను ఎదుర్కొన్నానని, తాను చావుకు భయపడనని ఆమె చెప్పారు.