Tahawwur Rana | ముంబై 26/11 పేలుళ్ల కేసులో (Mumbai Terror Attacks) ప్రధాన నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా (Tahawwur Rana) అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను ఎన్ఐఏ (NIA) కస్టడీలో ఉన్నారు. ఈ సందర్భంగా తహవ్వుర్‌ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా అతడు ముంబై ఉగ్రదాడి వెనుక తన పాత్రను అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా ఇండియా టుడే నివేదించింది.
ఢిల్లీలోని తీహార్ జైలు (Tihar Jail)లో ఎన్ఐఏ కస్టడీలో ఉన్న తహవ్వుర్ విచారణలో.. తాను పాకిస్థాన్ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్‌ను అని చెప్పినట్లు సదరు నివేదిక వెల్లడించింది. అంతేకాదు తాను, తన స్నేహితుడైన డేవిడ్ హెడ్లీకి పాక్‌కు చెందిన లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు కూడా అంగీకరించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్ర సంస్థ ప్రధానంగా గూఢచారి నెట్‌వర్క్‌గా పనిచేస్తుందని కూడా రాణా ఎన్ఐఏకి చెప్పినట్లు సమాచారం.
ముంబై పేలుళ్ల కేసులో రాణా ప్రధాన నిందితుడు. అతడు పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు. ముంబై ఉగ్రదాడి కుట్రదారు డేవిడ్ కోల్మాన్ హెడ్లీతో తహవూర్ రాణాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ కలిసి ఉగ్రదాడికి ప్రణాళిక రచించారు. దాడి అనంతరం అమెరికాకు పారిపోయాడు. 2009లో రాణాను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అమెరికాలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న రాణాను అగ్రరాజ్యం ఇటీవలే భారత్‌కు అప్పగించింది. ప్రస్తుతం అతడు ఎన్ఐఏ కస్టడీ (NIA custody)లో ఉన్నారు.
కాగా భారత్‌లో అక్రమంగా చొరబడిన 10 ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న తమ నరమేథం మొదలుపెట్టారు. రెండు లగ్జరీ హోటళ్లు, రైల్వేస్టేషన్, జెవిస్ సెంటర్ ఇలా నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా 60 గంటలపాటు సాగిన నరమేథంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో పలువురు భద్రతాసిబ్బంది కూడా ఉన్నారు. భద్రతా బలగాల దాడిలో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. ఆ తర్వాత అతడికి ఉరిశిక్ష విధించారు.
Also Read..
Army doctor | ఆ హైదరాబాదీ వైద్యుడిని మెచ్చుకున్న ఆర్మీ చీఫ్.. ఎందుకంటే..!
Jyoti Malhotra | కేరళ పర్యాటక ప్రచారంలో జ్యోతి మల్హోత్రా..