న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకూ యాక్సిడెంట్ల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) తెలిపారు. ప్రమాదాల నివారణపై లోక్‌సభలో సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో జరిగే సమావేశాలకు వెళ్లిన సమయంలో.. రోడ్డు ప్రమాదాలపై చర్చ జరుగుతున్నప్పుడు.. తన ముఖాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తానని మంత్రి పేర్కొన్నారు. తొలి సారి కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో .. ప్రమాదాలను 50 శాతం వరకు తగ్గించేందుకు టార్గెట్ పెట్టుకున్నానని, కానీ ప్రమాదాలను తగ్గించడం కాదు కదా, వాటి సంఖ్య పెరుగుతోందని చెప్పడానికి సిగ్గుపడడం లేదని మంత్రి తెలిపారు.
📍 नई दिल्ली | लोक सभा
सड़क दुर्घटना में होने वाली मौतों के आंकड़ों के संबंध में केंद्रीय मंत्री श्री @nitin_gadkari जी का उत्तर। #QuestionHour #LokSabha #WinterSession2024 pic.twitter.com/8Bx8PtHHtj
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) December 12, 2024
రోడ్డు ప్రమాదాలపై అంతర్జాతీయ సమావేశాల్లో చర్చలు జరిగే సమయంలో తన ముఖాన్ని దాచుకోవాల్సి వస్తోందని మంత్రి చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సప్లిమెంటరీ ప్రశ్నకు బదులిస్తూ.. భారత్‌లో మనుషుల ప్రవర్తన మారాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజం చాలా మారాలని, రోడ్డు రూల్‌ను అందరూ గౌరవించాలన్నారు. కొన్నేళ్ల క్రితం ఫ్యామిలీతో ప్రయాణిస్తున్న సమయంలో తన వాహనానికి యాక్సిడెంట్ జరిగిందని, అప్పుడు చాలా రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు గుర్తు చేశారు. ప్రమాదాలపై వ్యక్తిగత అనుభవం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.
రోడ్లపై ట్రక్కుల పార్కింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు మంత్రి చెప్పారు. చాలా వరకు ట్రక్కులు లేన్ డిసిప్లేన్ పాటించడం లేదన్నారు. బస్సు బాడీని తయారు చేసే విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలన్నారు. బస్సు విండో దగ్గర సుత్తె ఉండాలని, ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయంలో దాని ద్వారా తప్పించుకోవచ్చు అన్నారు.
దేశంలో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల వల్ల సుమారు 1.78 లక్షల మంది మరణిస్తున్నట్లు చెప్పారు. దీంట్లో 60 శాతం మంది బాధితులు 18 నుంచి 34 ఏళ్ల మద్య వయసు వారున్నారు. ప్రమాదాల జాబితాలో ఉత్తరప్రదేశ్ లీడింగ్‌లో ఉన్నది. నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నది. యూపీలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏడాది 23 వేల మంది మరణిస్తున్నారు. అంటే సుమారు 13.7 శాతం అన్నమాట. ఆ తర్వాత జాబితాలో తమిళనాడు ఉన్నది. తమిళనాడులో ప్రతి ఏడాది 18 వేల మంది మరణిస్తున్నారు. ఇది మొత్తంలో 10.6 శాతం.
మహారాష్ట్రలో ప్రతి ఏడాది 15 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్(13వేలు) ఉన్నది. ఢిల్లీ సిటీలో ప్రతి ఏడాది 1400 మంది మరణిస్తున్నారు. బెంగుళూరు రెండో స్థానంలో ఉన్నది ఆ సిటీలో 915 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జైపూర్‌లో ఏడాదికి 850 మంది మరణిస్తున్నారు. అత్యంత సులువుగా డ్రైవింగ్ లైసెన్సు దొరికే దేశం మనదే అని చెప్పడానికి సంకోచించడం లేదన్నారు. కానీ జనాల్లో డ్రైవింగ్ సెన్స్ లేదన్నారు.