న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) దీనిపై తొలిసారి స్పందించారు. గెలుపు కోసం నిజాయితీతో పనిచేశానని, కానీ తన ప్రయత్నంలో విఫలమైనట్లు ఆయన చెప్పారు. దీనికి పూర్తిగా తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రశాంత్ వెల్లడించారు. 243 స్థానాలు ఉన్న బీహార్‌లో.. జన్ సూరజ్ పార్టీ 238 స్థానాల్లో పోటీ చేసింది. ఓటమి తమకు సెట్‌బ్యాక్ అని, కానీ పొరపాట్లను సవరించుకుంటామన్నారు. మళ్లీ పునర్ నిర్మిస్తామని, వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. ఎన్డీఏకు ప్రజలు తమ మద్దతు తెలిపారని, హామీలను నెరవేర్చే బాధ్యత ప్రధాని మోదీ, సీఎం నితీశ్‌పై ఉందన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకవేళ నితీశ్ సర్కారు మహిళలకు పది వేలు ఇవ్వకుంటే జేడీయూకు కనీసం 25 సీట్లు కూడా వచ్చేది కాదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 1.5 కోట్ల మందికి ఒకవేళ నితీశ్ ప్రభుత్వం రెండు లక్షలు ఇస్తే అప్పుడు కచ్చితంగా రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఓట్ చోరీ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నదని, మాది చిన్న పార్టీ అని, జాతీయ పార్టీలు అన్నీ కలిసి దీనిపై చర్చలు నిర్వహించాలన్నారు. ఒకవేళ అవసరం అయితే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన సూచించారు. నితీశ్ తరహాలో బీహార్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమైనట్లు ఆయన తెలిపారు. కులం, మతం, ఓట్ల ప్రాతిపదికన బీహార్‌ను వాళ్లు విభజన చేశారని ఆరోపించారు.