Sharad Pawar | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: కేవలం ఒకే ఒక్క ఓటుతో 1999లో నాటి వాజ్పేయి ప్రభుత్వం కూలిపోవడానికి ముందు జరిగిన రహస్య మంతనాల గురించి ఎన్సీపీ(శరద్ పవార్) అధినేత శరద్ పవార్ తొలిసారి నోరు విప్పారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగడానికి 8-10 నిమిషాల ముందు సభ వెలుపల జరిగిన మంతనాల కారణంగా అధికార ఎన్డీఏ కూటమికి చెందిన ఒక ఓటు ప్రతిపక్షానికి అనుకూలంగా పడిందని, దీని వెనుక తన పాత్ర ఉందని పవార్ వెల్లడించారు. ప్రతిపక్షానికి అనుకూలంగా తానే ఆ ఒక్క ఓటును తీసుకువచ్చానని, అయితే దాన్ని ఎలా సాధించానన్న విషయాన్ని మాత్రం వెల్లడించబోనని పవార్ అన్నారు. ఢిల్లీలో ఒక మరాఠీ పుస్తకావిష్కరణలో ఆయన 1999 నాటి ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు.