న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (Air India) విమానం కుప్పకూలిపోయిన దుర్ఘటన జరిగి శనివారానికి సరిగ్గా నెల రోజులైంది. గత నెల 12న ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. ఈ ప్రమాద ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చాడని నివేదికలో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని తెలిపింది. తర్వాత పైలట్లు మేడేకాల్ ఇచ్చారని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించింది. ఈలోపే విమానం కూలిపోయిందని పేర్కొంది.
ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పూర్తిగా పరిశీలించామని, విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసిశామని తెలిపింది. వాటిని భద్రపరిచినట్లు పేర్కొంది. ప్రమాదానికి ముందు విమానంలో ఫ్యూయెల్, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని తెలిపింది. అదేవిధంగా విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏవీ లేవని వెల్లడించింది.
విమానం టేకాఫ్ అయిన సెకను వ్యవధిలోనే రెండు ఇంధన కటాఫ్ స్విచ్‌లు ఆఫ్ అయ్యాయి. దీంతో రెండు ఇంజిన్లు గాలిలోనే ఆగిపోయాయి. రెండు స్విచ్‌లు ఒకేసారి ఆఫ్ అవడంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇంజిన్లు గాలిలోనే నియంత్రణ కోల్పోయాయని ఏఏఐబీ పేర్కొంది. ఫ్యూయెల్ స్విచ్‌లను ఎందుకు కటాఫ్ చేశారు? అని ఓ పైలట్ మరో పైలట్ అడుగుతున్నట్లు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో నమోదయింది. దానికి మరొకరు ‘తాను చేయలేదు’అని సమాధానం ఇచ్చారు. ఇది పలు సందేహాలకు తావిస్తున్నదని వెల్లడించింది. రెండు ఇంజిన్లు ఒకేసారి ఆగిపోయే ముందు విమానం 180 నాట్ల గరిష్ట వేగానికి చేరుకుంది. అయితే ఇంధన స్విచ్‌లను ఆపివేయడంతో వేగం, ఎత్తులో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. విమానం ప్రయాణిస్తున్న మార్గంలో పక్షులు తిరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రమాదానికి అది కారణం కాదని తన నివేదికలో నిర్ధారించింది.
కాగా, ఇంధన సరఫరా స్విచ్‌లో లోపం తలెత్తినట్లు ఏఏఐబీ సమర్పించిన నివేదికపై బోయింగ్ సంస్థ స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని విచారం వ్యక్తంచేసింది. విచారణకు, తమ కస్టమర్‌కు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.