న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29 నుంచి లోక్‌సభ సమావేశాలు మొదలవుతాయని, ఈ సారైనా సభ సజావుగా సాగుతుందని ఆశిస్తున్నానని స్పీకర్ వ్యాఖ్యానించారు. అన్ని పక్షాల సభ్యులు సహకరిస్తే సభ సజావుగా సాగుతుందన్నారు. అన్ని అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు.
అదేవిధంగా లోక్‌సభ సభ్యులు తమతమ నియోజకవర్గాల్లో చేపట్టిన మంచి పనుల గురించి కూడా సభలో చర్చించనున్నట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్న అంటూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పీకర్ స్పందించారు. లోక్‌సభ సభ్యులుగానీ, రాష్ట్రాల్లోని ఇతర చట్టసభల సభ్యులుగానీ పాజిటివ్‌గా మాట్లాడాలని సూచించారు. భారతీయులుగా ఏ దేశం మన దేశం కంటే గొప్పది కాదనే విషయాన్ని ప్రజాప్రతినిధులు విశ్వసించాలని ఓంబిర్లా హితవు పలికారు.