Hyderabad : హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఆర్జీఐ) ఎయిర్‌పోర్టులో ఆదివారం ఉదయం హైఅలర్ట్ విధించారు. ఇక్కడికి రావాల్సిన నెదర్లాండ్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడమే ఇందుకు కారణం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కౌలాలంపూర్ ఎయిర్వేస్కు చెందిన ఒక విమానం నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డ్యామ్ నుంచి శంషాబాద్ వస్తోంది. అయితే, ఈ విమానంలో బాంబు ఉందని ఆదివారం ఉదయం ఆర్జీఐ అధికారులకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది.
ఈ విమానంలో బాంబు ఉందని, అది ఏ క్షణమైనా పేలవచ్చని మెయిల్లో పేర్కొన్నారు. విమానం హైదరాబాద్ చేరకముందే పేలే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. మెయిల్ అందుకున్న ఎయిర్‌పోర్టు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అయితే, ఆ విమానం కొంతసేపటి క్రితం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ వెంటనే అధికారులు ప్రయాణికుల్ని విమానం నుంచి దింపేశారు. వెంటనే విమానాన్ని దూరంగా, సురక్షితంగా తీసుకెళ్లారు. ప్రస్తుతం సెక్యూరిటీ అధికారులు విమనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు రావడం ఇది మూడోసారి. రెండు రోజుల క్రితం కూడా ఇలాగే బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. మలేసియా నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏసియా విమానంలో బాంబు ఉందని మెయిల్ వచ్చింది.
ఆ విమానం కూడా హైదరాబాద్ చేరకముందే ఏ క్షణమైనా పేలిపోయే ప్రమాదం ఉందని మెయిల్లో ఉంది. అప్పుడు కూడా అధికారులు అలర్ట్ అయి, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. అయితే, ఎలాంటి బాంబూ లేదని తేల్చారు. అంతుకుముందు శుక్రవారం కూడా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానంలో కూడా బాంబు ఉందని ఇలాగే మెయిల్ వచ్చింది. అయితే, విమానం ఇక్కడికి చేరుకున్న వెంటనే తనిఖీలు నిర్వహించి, అలాంటిదేమీ లేదని తేల్చారు. తరచూ ఇలా విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తుండటం ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులకు, ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తోంది.