Odisha | భువనేశ్వర్, ఏప్రిల్ 4: భార్య చేతుల్లో దాదాపు 15 ఏండ్ల పాటు చిత్రహింసలు అనుభవించిన ఓ భర్తకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఒడిశాకు చెందిన ఆ వ్యక్తికి 2003 మే 11న వివాహమైంది. ఇక అప్పటి నుంచి మూడు కేసులు, ఆరు వేధింపులు అన్నట్టుగా సంసారం సాగింది. అతడిపై భార్య 47 ఎఫ్ఐఆర్లు నమోదుచేసింది. ఆత్మహత్య చేసుకుంటానంటూ పదేపదే బెదిరింపులకు దిగింది.
చివరకు విడాకులతో కథ సుఖాంతమైంది. భార్యకు అమెరికాలోని న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంఎస్సీ డిగ్రీ లభించేందుకు అండగా నిలబడిన ఆ భర్తకు చివరకు మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో టీసీఎస్‌లో చేస్తున్న ఉద్యోగం కూడా వదులుకోవలసి వచ్చింది. ఉద్యోగ రీత్యా కోల్‌కతా, భువనేశ్వర్, థాయ్‌లాండ్, జపాన్, అమెరికా సహా అనేక చోట్ల నివసించేటప్పుడు అతనికి అక్కడ కూడా భార్య నుంచి వేధింపులు, బెదిరింపులు తప్పలేదు.
భార్య పెట్టే చిత్రహింసలు భరించలేక 2009లో అతను విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా భర్తతోనే జీవిస్తానంటూ ఆమె కోర్టుకు తెగేసి చెప్పి ంది.కటక్ ఫ్యామిలీ కోర్టు, ఒడిశా హైకోర్టు ఎట్టకేలకు ఆ భర్తకు విడాకులు మంజూరుచేసి మనోవర్తి కింద ఆమెకు రూ.63 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించింది.