లక్నో: ఒక వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు. అతడి మరణాన్ని భార్య తట్టుకోలేకపోయింది. దీంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. (Husband Dies Of Illness, Wife Hangs Self) భార్యాభర్తల మృతితో వారి ఏడాది వయస్సున్న బిడ్డ అనాథ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఝల్కారీ నగర్లో నివసిస్తున్న 35 ఏళ్ల రూపేష్‌కు కిడ్నీ దెబ్బతిన్నది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి చికిత్స అందించేందుకు కుటుంబం అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఫిబ్రవరి 13న అతడు మరణించాడు.
కాగా, భర్త రూపేష్ మరణాన్ని భార్య అయిన 32 ఏళ్ల రీనా తట్టుకోలేకపోయింది. భర్తను కోల్పోయిన ఆమెను ఓదార్చేందుకు ఇరుగు పొరుగు వారు ప్రయత్నించారు. అయితే తీవ్ర మనస్తాపం చెందిన ఆమె అదే రోజు రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మరునాడు ఇంటి తలుపు తీయకపోవడంతో పొరుగువారు అనుమానించారు. తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. సీలింగ్‌కు ఉరి వేసుకుని వేలాడుతున్న రీనా మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. అయితే రూపేష్, రీనా మరణంతో వారి ఏడాది వయస్సున్న బిడ్డ అనాథ అయ్యింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం రీనా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.