మైసూర్: కరోనా ప్రభావంతో హృద్రోగ సంబంధ వ్యాధులు తీవ్రమవుతున్నాయని, దానివల్లే ఇటీవల కర్ణాటకలోని హసన్‌లో 20 మందికి పైగా మరణించారన్న సీఎం సిద్ధరామయ్య ప్రకటన ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. దీంతో హార్ట్ ఎటాక్ మరణాల భయంతో మైసూర్లో సుప్రసిద్ధ జయదేవ్ హాస్పిటల్‌కు వందల మంది ప్రజలు చెకప్‌ల కోసం క్యూలు కడుతున్నారు. హృద్రోగ వ్యాధుల నిపుణుల వద్దకు ఉదయాన్నే అనేక మంది ఔట్ పేషంట్లు తరలివస్తున్నారు. కాగా, ప్రజలు ఈ విషయంలో భయాందోళన చెందవద్దని, వదంతులు నమ్మవద్దని దవాఖాన సూపరింటెండెంట్ సదానంద ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ దవాఖానలో పరీక్షలు చేయించుకున్నంత మాత్రాన సమస్యకు పరిష్కారం లభించదని ఆయన అన్నారు. ప్రజలు జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని ఆయన సూచించారు.